CM Chandrababu: ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు దేశవ్యాప్తంగా మద్దతు అవసరం అని భావిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి వీలుగా కావాల్సిన సంఖ్యాబలం కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల్లో ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు జమిలి లోగా ఎన్డీఏ బలోపేతంపై కూడా దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ పక్ష సమావేశం ఢిల్లీలో జరగనుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో సమావేశానికిప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా,ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రి, కీలక నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* వాజ్పేయి కి నివాళి
ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయ్ శత జయంతి వేడుకలు. ఈ సందర్భంగా వాజ్పేయికి ఘన నివాళులు అర్పించనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఐదు గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు బాబు. అనంతరం కేంద్ర హోం మంత్రితో సైతం ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించనున్నారు. ఇందులో ఏపీకి ప్రాధాన్యత దక్కేలా చంద్రబాబు కేంద్ర పెద్దల వద్ద కీలక ప్రతిపాదనలు ఉంచనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ జనవరి 8న ఏపీలో పర్యటించనున్నారు. దీంతో చంద్రబాబు ప్రధానితో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా నిధుల అంశం పైన వారి మధ్య చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వరుసగా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది.
* దక్షిణాది బాధ్యతలు
ఎన్డీఏ నేతల సమావేశానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర తో పాటు ఝార్ఖండ్ ఎన్నికల తరువాత ఈ సమావేశం జరుగుతుండడం విశేషం. మరోవైపు ఢిల్లీతోపాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ విస్తరణ కోసం ప్రధాని మోదీ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అనుసంధానంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. వాటి సమన్వయ బాధ్యతలను చంద్రబాబుకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాదిన ఎన్ డి ఏ బాధ్యతలు చంద్రబాబు పై పెడతారని సమాచారం. 2029లో ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.