TDP Government: ఎక్కడైనా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి.లేకపోతే ఏం జరుగుతుందో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ.ప్రజలకు వ్యక్తిగతంగా మేలు చేసే సంక్షేమ పథకాలు మంచిదే అయినా..అదే సమయంలో ప్రభుత్వ పాలన పట్ల సానుకూలత చూపేలా కూడా చేయాలి.సంక్షేమం అందిస్తున్నామని చెప్పి ప్రజలు ఇబ్బందులకు గురయ్యేలా చేస్తే..మొన్నటి ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి. రహదారుల విషయంలో వైసిపి సర్కార్ వ్యవహరించిన తీరు ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చకు దారి తీసింది.ఏదైనా ఆలయాల సందర్శనకు, సంక్రాంతి సమయాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఏపీలో రహదారుల పరిస్థితి చూసి ఎద్దేవా చేసేవారు. రోడ్లను ఇంత అధ్వానంగా ఉంచడమా? అంటూ మండిపడేవారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్ సైతం..మీడియా సమావేశంలో రోడ్లపై పిట్ట కథలు చెప్పి ఏపీ పరువును తీసిన సంగతి తెలిసిందే.అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంతంగానే రహదారుల గుంతల్లో పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అది జనసేనకు ఎంత ఊపు తెచ్చిందో.. జగన్ సర్కార్ను అంత డ్యామేజ్ చేసింది.
* ప్రజాక్షేత్రంలోకి జగన్
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఈ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబుతో పాటు పవన్ కూడా చెప్పుకొచ్చారు.అయితే ప్రాధాన్యత క్రమంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. తొలుత పింఛన్ల మొత్తాన్ని పెంచారు.ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. డీఎస్సీ నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకంపై అధ్యయనం జరుగుతోంది.అయితే జగన్ మాత్రం కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వకూడదని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వారానికి రెండు రోజులపాటు ఉండాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని భావిస్తున్నారు.అయితే అక్కడే తేడా కొడుతోంది.
* కూటమి పార్టీలకు ప్రచార అస్త్రంగా..
ఇప్పటికే పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో 4500 కోట్ల రూపాయలతో రహదారులు,కాలువలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి వాటిని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇంకోవైపు రహదారుల్లో గుంతలను పూడ్చే పని జరుగుతోంది. కేంద్ర నిధులతో కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.ఒకవేళ జగన్ తన పర్యటనలో అదే రహదారుల్లో రాకపోకలు సాగిస్తే మాత్రం.. అది కూటమి పార్టీలకు ప్రచార అస్త్రంగా మిగలనుంది. ఏడు నెలల పాలనలో ఏం చేశారు అని అడిగితే.. కూటమి పార్టీల వద్ద రహదారులను బాగు చేశామన్న సమాధానం ఉంది. అదే ఐదేళ్లపాటు మీరు ఏమి చేశారు అన్న ప్రశ్నలు కూటమి పార్టీల శ్రేణుల వద్ద ఉన్నాయి. వాటినే వారు అస్త్రాలుగా మార్చుకోనున్నారు. ప్రస్తుతం కూటమి శ్రేణులు దీనిపైనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రహదారుల అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ అంశంగా మారుతోంది. జగన్ క్షేత్రస్థాయి పర్యటనపై వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళనకు కారణమవుతోంది.