HomeతెలంగాణTG Pension: ఏడాది అవుతోంది.. ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ సార్?

TG Pension: ఏడాది అవుతోంది.. ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ సార్?

TG Pension: కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికల ముందు ఆ పార్టీ ఊరూరా ప్రచారం చేపట్టింది. అధిష్టానంను రప్పించి హామీలను గుప్పించింది. స్వయంగా రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఆరు గ్యారెంటీలకు తమ హామీ అంటూ అభయం అందించారు. పవర్‌లోకి రాగానే మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత అందిస్తామన్నారు. రాష్ట్ర నేతలు సైతం ఇంటింటికీ వెళ్లి బ్రోచర్లు అందిస్తూ ఓట్లను అభ్యర్థించారు. గత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తో, హస్తం పార్టీ ఇస్తున్న హామీలను నమ్మో జనం మూడు రంగులకు జై కొట్టారు. రేవంత్‌ సర్కారు కొలువు తీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చింది. మిగతా హామీలు కూడా త్వరగానే నెరవేరుతాయని అంతా భావించారు. అయితే ఏడాది కాలంలో రైతు రుణమాఫీ, రూ.500లకు సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్‌ వంటివి మాత్రమే అమల్లోకి వచ్చాయి. మెజార్టీ లబ్ధిదారులు ఉండే ఆసరా పింఛన్‌ పెంపు, నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు ఆర్థిక సాయం వంటివి ఇంకా షురూ కాలేదు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే ప్రస్తుతం నడుస్తోంది. అయితే సొంత జాగా ఉన్న వారికే తొలిప్రాధాన్యం అంటూ సర్కారు పేర్కొంటున్న నేపథ్యంలో స్థలం లేని నిరుపేదలకు నిరీక్షణే మిగలనుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అన్నదాతలు చాలా మంది రుణమాఫీ కాక సర్కారుపై విమర్శలు గుప్పిస్తుండగా.. రైతు భరోసా ఇంకెప్పుడో అంటూ మిగతా వారు నిట్టూరుస్తున్నారు.

సర్కారు వాదన ఇదీ..
ఇక సర్కారు నుంచి వినిపించే మాట మరో రకంగా ఉంది. ఆరు..నూరైనా అన్ని హామీలు నెరవేనుస్తామంటోంది. తమది ‘గరీబీ హఠావో నినాదం’ ఇచ్చిన పార్టీ అని చెబుతోంది. సంక్షేమం, అభివృద్ధి తమకు రెండు కళ్లు అంటూ పేర్కొంటోంది. గత సర్కారు చేసిన ఆరు లక్షల కోట్ల అప్పుల వల్లే ఆలస్యమవుతోంది అంటోంది. నిండుకున్న ఖాజానా నిత్యం కనిపిస్తున్నా అప్పులకు వడ్డీలు కడుతూనే ఒక్కో హామీని ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఈ ‘ఇందిరమ్మ రాజ్యం’లో ప్రతీ నిరుపేద మొములో చిరునవ్వు చూడడమే తమ లక్ష్యమంటోంది. అయితే ఓ వైపు అప్పులు.. మరో వైపు హామీలు.. ఇది రేవంత్‌ సర్కారు ముందున్న ప్రధాన సవాళ్లు. రానున్న రోజుల్లో వీటిని ఏవిధంగా సమతూకం పాటిస్తూ ముందుకు తీసుకెళతారన్నది సర్వత్రా ఆసక్తికర అంశం.
సంపత్, సీనియర్ జర్నలిస్ట్

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version