Bhogapuram Airport :భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఇప్పుడు టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో ఎయిర్ పోర్టు నిర్మాణం పనులు వేగవంతం అయ్యేందుకు అవకాశం కలిగింది. రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబు సైతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. కీలక సూచనలు చేశారు. అటు నిర్మాణ బాధ్యతలు చూస్తున్న జిఎంఆర్ కంపెనీకి కీలక సూచనలు చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణ ఆకృతి గురించి జిఎంఆర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించేసరికి చంద్రబాబు సైతం ఫిదా అయ్యారు.ప్రతి కట్టడం వెనుక ఒక ప్రత్యేకతను చాటుతూ.. నిర్మాణాలు చేపట్టడం విశేషం.
విమానాశ్రయాన్ని రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నా.. గరిష్టంగా మూడేళ్ల లోపు పూర్తి చేసి.. రన్ వే ఫై విమానాలను నడపాలన లక్ష్యంతో జిఎంఆర్ సంస్థ పనులు చేపడుతోంది. మొత్తం మూడు దశలుగా విభజించి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి తొలి దశలో 60 లక్షల మంది, రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణాలు సాగించేలా దీనిని నిర్మించనున్నారు. ఒకేసారి 20 కి పైగా విమానాల్లోంచి ప్రయాణికులు దిగేలా 22 ఏరో బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది పూర్తయ్యేనాటికి భోగాపురం నుంచి విశాఖ వరకు అన్ని రంగాలతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జాతీయ రహదారి పక్కనే రాజాపులోవ వద్ద సుమారు పది ఎకరాల్లో అంతర్జాతీయ వసతులతో ప్రయాణికుల విశ్రాంతి మందిరాన్ని నిర్మించాలని చూస్తోంది. తూర్పు తీరానికి అనుకొని ఉన్నందున దేశ రక్షణ అవసరాల కోసం వినియోగించుకునేలా 10 ఎకరాలు కేటాయించనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 500 ఎకరాల్లో ఏరో సిటీని అభివృద్ధి చేయనుంది. దీన్ని ఐటి పార్కులు, ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగించనుంది.
విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వం కల. 2203 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం జరగనుంది. 4,592 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ప్యాసింజర్ టెర్మినల్, కార్గో సముదాయం, విమానాల నిర్వహణ, మరమ్మత్తుల యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి వసతులు కల్పించనున్నారు.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు, కష్టం ఇమిగ్రేషన్ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా 3.8 కి.మీ రన్ వే ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికైతే 36 నెలల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రతి కట్టడం అద్భుతంగా ఉండాలని.. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని డిసైడ్ కావడం విశేషం.
ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న జిఎంఆర్,పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు.. ఇద్దరూ ఉత్తరాంధ్ర ప్రాంతాలు కావడం గమనార్హం. అందుకే ప్రత్యేక చిత్తశుద్ధితో వారిద్దరు ముందుకు సాగుతున్నారు. విమానాశ్రయ టెర్మినల్ నమూనా, ఫ్లయింగ్ ఫిష్ గా పిలిచే సముద్ర చేప ‘ఎక్సోకోయేటస్’ నమూనాలో వీటిని తీర్చిదిద్దనన్నారు. పొడవైన రెక్కల సాయంతో నీటి ఉపరితలంపై ఎగిరి, ప్రయాణించగలిగే ఈ చేప ఆకృతిలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈత కొడుతున్న మత్స్యం ఆకారంలో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అసలు ఏంటి చేప.. దాని కథేంటో తెలుసుకుందాం..

–భోగాపురం ఎయిర్ పోర్ట్ డిజైన్ లో ఉన్న ఎగిరే చేప విశేషాలు ఇవీ..
ఎగిరే చేపలు వీటినే ఆంగ్లంలో రే-ఫిన్డ్ చేపలు అంటారు. ఛాతి నుంచే మొదలైన రెక్కలతో ఈ చేపలు ఉంటాయి. ఈ ఎగిరే చేపలు శక్తితో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. గంటకు 35 మైళ్ల (56 కిలోమీటర్లు) కంటే ఎక్కువ వేగంతో నీటి నుండి తమను పైకి లేపుకొని పోతుంటాయి. గాలిలో ఒకసారి రెక్కలతో ఎగిరితే 650 అడుగుల (200 మీటర్లు) వరకు పయనిస్తాయి.. ఈత కొట్టేటప్పుడు ఈ చేపలు రెక్కలను చేపలా మార్చుతాయి. గాలిలో ఎగురుతున్నప్పుడు మాత్రం పక్షుల వలే క్రమబద్దంగా రెక్కలను విప్పి పయనిస్తాయి. ఈ ఎగిరే చేపల యొక్క మరొక ఆసక్తికరమైన లక్షణం దాని అసమాన తోక. చేపకు ఈ తోకను ఈదడానికి.. ఎగరడానికి శక్తిని ఇస్తుంది. ఎగిరే చేపల పొడవు 18 అంగుళాలు (45 సెంటీమీటర్లు) వరకు ఉంటుంది. అయితే సగటు 7 నుండి 12 అంగుళాలు (17 నుండి 30 సెంటీమీటర్లు) వరకూ ఉంటాయి..
ఎగిరే చేపలలో దాదాపు 40 జాతులు ఉన్నాయి. ఎగిరే చేపలు ఉష్ణమండల, సమశీతోష్ణ మండలంలోని సముద్రాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి యునైటెడ్ స్టేట్స్ యొక్క అట్లాంటిక్ , పసిఫిక్ తీరాలలో చూడవచ్చు. ఇవి అట్లాంటిక్, పసిఫిక్ , హిందూ మహాసముద్రాలలో కూడా కనిపిస్తాయి. ఈ మహాసముద్రాలు చాలా ఎగిరే చేపలకు ఆవాసాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని పగడపు దిబ్బల శివార్లలో కూడా నివసిస్తాయి. ఎగిరే చేపలు తమ అనేక సముద్రపు మాంసాహార జంతువుల నుండి తప్పించుకోవడానికి ఎగిరే యంత్రాంగాన్ని అభివృద్ధి చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఒకసారి గాలిలో ఎగిరితే అవి కొన్నిసార్లు పక్షులకు ఆహారంగా మారతాయి. ఎగిరే చేపలు రకరకాల ఆహారాలను తింటాయి, అయితే నాచు వాటి ఆహారంలో ఎక్కువ భాగంగా ఉంది. కొన్నిసార్లు చిన్న క్రస్టేసియన్లను కూడా ఇవి తింటాయి. ఈ చేపలు నీటి ఉపరితలం దగ్గర, బహిరంగ సముద్రంలో గ్రుడ్లు పెడుతాయి. ఒక ఆడ ఎగిరే చేప గుడ్లను సముద్రపు నాచు వద్ద.. తేలియాడే చెత్తకు అంటుకునే విధంగా పెడుతుంది. కొత్తగా పొదిగిన ఎగిరే చేపల నోటి దగ్గర మీసాలు ఉంటాయి. ఇది వాటిని మొక్కల వలె మారువేషంలో ఉంచడానికి సాహయపడుతాయి. తద్వారా వాటిని వేటాడే జంతువుల నుండి కాపాడుతుంది. ఎగిరే చేప సగటున ఐదు సంవత్సరాలు జీవిస్తుంది. ఎగిరే చేపలు కాంతికి ఆకర్షితులవుతాయి. చిన్న, బాగా వెలుతురు ఉన్న పడవల్లోకి దూసుకెళ్లుతాయి. ఈ కారణంగా వాటిని పట్టుకోవడం చాలా సులభం. ఈ జాతుల్లో నాలుగు రెక్కల ఎగిరే చేపలు కూడా ఉంటాయి..
*ఈ ఎగిరే చేపలు చాలా వినూత్నంగా.. విభిన్నంగా ఉంటాయి. దాని రూపు రేఖలు చాలా కొత్తగా ఉంటాయి. యూనిక్యూ డిజైన్ ను తలపిస్తాయి. ఈ చేపలు ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలోనూ సముద్రంలో పడవలో ఉన్న హీరోను తాకుతాయి. ఇప్పటివరకూ ఏ ఎయిర్ పోర్టుకు ఇలాంటి డిజైన్ వాడలేదు. చాలా కొత్తగా క్రియేటివ్ గా ఉండడంతోనే ఆ చేప ఆకారంలో ‘భోగాపురం’ ఎయిర్ పోర్టును డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది.