YCP alliance concern: ఏపీలో ( Andhra Pradesh)కూటమి దిగ్విజయంగా కొనసాగుతోంది. 18 నెలల పాలన పూర్తి చేసుకుంది. మూడు పార్టీల మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతోంది. కింది స్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా.. పై స్థాయిలో మాత్రం చక్కటి సమన్వయం ఉంది. అయితే ఆ మూడు పార్టీల మధ్య ఎప్పుడు దూరం పెరుగుతుందా అనే ఆత్రుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఇప్పట్లో తాము విడిపోయే పరిస్థితిలో లేమని కూటమి సంకేతాలు ఇస్తోంది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ మాత్రమే 15 సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ అదే మాట చెబుతున్నారు. ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. ఆ పార్టీకి అర్జెంటుగా మూడు పార్టీలు విడిపోవాలి. విడివిడిగా పోటీ చేస్తే తాను అధికారంలోకి రావచ్చు అన్న ఆలోచనతో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
పవన్ త్యాగం
రాష్ట్రం కోసం తాను తగ్గి ముందుకెళ్లాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్( Pawan Kalyan) చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన అన్నది నిజం కూడా. ఎందుకంటే తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో సైతం జనసేన విజయం సాధించింది. ఈ లెక్కన చూస్తే జనసేన బలం తగ్గట్టు ఆ పార్టీకి సీట్లు పొత్తులో భాగంగా లభించలేదు. అయినా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ కారణాలతో వెనక్కి తగ్గారు పవన్ కళ్యాణ్. అదే విషయాన్ని అప్పుడు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. అయితే మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు అదే మాట చంద్రబాబుతో పాటు లోకేష్ అనేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభం అయింది.
వైసీపీలో ఆందోళన
అయితే జనసేన తో( janasena) పాటు టిడిపి నుంచి ఇటువంటి ప్రకటనలు వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్లేషకులు, కుహనా మేధావులు రంగంలోకి దిగారు. అలా అయితే ఏ పార్టీ సీట్లను త్యాగం చేస్తుంది అన్నది వారి ప్రశ్న. తెలుగుదేశం పార్టీ శాశ్వత రాజకీయాలు చేయాలనుకుంటుంది. కూటమి పార్టీల్లో ఆ పార్టీ ఇదే సింహభాగం. ఆ తరువాత స్థానంలో ఉంటుంది జనసేన. ఆ రెండు పార్టీలతో పోల్చుకుంటే జాతీయస్థాయిలో అగ్రస్థానం బిజెపిది. ఎలాగూ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనే సంకేతాలు వస్తున్నాయి. అసెంబ్లీ సీట్ల పరంగా జనసేనకు ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. పార్లమెంటు స్థానాలపరంగా బిజెపికి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మాత్రం మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే కుదిరి అవకాశం ఉంది. కానీ ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అందుకే తనకు అనుకూలమైన విశ్లేషకులతో పాటు కుహనా మేధావులకు రంగంలోకి దించింది.