MLA Rapaka : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్వామిభక్తి మరీ ఫీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. అధినేతను మనసులో పెట్టి కొలిచేస్తున్నారు. చివరికి తమ ఇంటి దైవంగా మార్చేశారు. ఏకంగా పెళ్లి శుభలేఖలో సైతం ఫొటోలను ముద్రించి తన టాలెంట్ చూపించారు. కోనసీమ జిల్లా రాజోలు నుంచి జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక రికార్డుకెక్కారు. అంతే వేగంగా వైసీపీ పంచన చేరిపోయారు. తన కుమారుడికి కూడా వైసీపీలో చేర్పించారు. 2024 ఎన్నికల్లో రాపాకకే జగన్ టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ఈ రోజు ఎమ్మెల్యే రాపాక కుమారుడి వివాహం జరగనుంది. సీఎం జగన్ హాజరుకానున్నారు. అయితే పెళ్లికోసం ముద్రించిన పెళ్లి పత్రిక మాత్రం వైరల్ గా మారింది. సర్వత్రా అందరి దృష్టిలో పడింది. శుభలేఖపై సీఎం వైఎస్ జగన్, భారతి దంపతుల చిత్రాలను ముద్రించారు. తమకు దైవ సమానులైన వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని రాపాక శుభలేఖలో పేర్కొన్నారు. శుభలేఖ పైభాగంలో జగన్ భారతి చిత్రాలను ఆకట్టుకునేలా ముద్రించారు. తద్వారా తన ‘స్వామి భక్తి’ని రాపాక చాటుకున్నారు.
రాపాకకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది పవన్ కళ్యాణ్. కానీ ఆయన మాత్రం తన ఆరాధ్య దైవంగా జగన్ ను మార్చుకున్నారు. ఇప్పటికే పలుమార్లు బయటా, అసెంబ్లీలో జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రాపాక వరప్రసాద్ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన ద్వారా తన వీర విధేయతను జగన్ పై రాపాక చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన కుమారుడి పెళ్లి ఆహ్వానపత్రికపై సీఎం దంపతుల ఫొటోలు ముద్రించి తాను జగన్ కు వీరభక్తుడినని చేసి చూపించారు.
ఇటీవల దొంగ ఓట్లతో గెలిచానంటూ కలకలం సృష్టించారు. తమకు ఇంత దెబ్బేసిన రాపాకను వచ్చే ఎన్నికల్లో ఓడించి తమ సత్తా చాటడానికి జనసేన పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇలా చాలెంజ్ చేసి మరీ పంచాయతీ ఎన్నికల్లో రాపాకకు జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చారు. ఆయన సొంత గ్రామంలోనూ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని సత్తా చాటారు. వచ్చే ఎన్నికల్లో రాపాక గెలుపు అంత ఈజీకాదు. కాపులు ఎక్కువగా ఉండే రాజోలులో జనసేనకు పట్టు ఎక్కువ. పైగా జనసేన అధినేతను నమ్మించి మోసం చేశారని రాపాకపై జనసేనతో పాటు కాపుల్లో ఆగ్రమం పెల్లుబికుతోంది. అందుకే జగన్ పై ఎంత వీర విధేయత, భక్తి చాటుకున్నా రాజోలులో రాపాకను గెలిపించలేరని శపధం చేస్తున్నారు.