Bapatla: ఏపీ ప్రభుత్వం దూకుడు.. తగ్గించకపోతే దుష్పరిణామాలే

బాపట్ల జిల్లాలో మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తగలబెట్టారు. భట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

Written By: Dharma, Updated On : June 29, 2024 1:55 pm

Bapatla

Follow us on

Bapatla: ఏపీలో రివేంజ్ రాజకీయాలు ఉండవని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం మాదిరిగా తాము వ్యవహరించమని చెప్పుకొచ్చింది. దీంతో ఏపీలో సరికొత్త రాజకీయం ప్రారంభమవుతుందని అంతా భావించారు. తమిళనాడు తరహాలో ప్రతీకార రాజకీయాలకు ఇక చెక్ పడుతుందని అంచనా వేశారు. అయితే అది తొలినాళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీకార దాడులు, కేసులు, విధ్వంసాలు కొనసాగుతుండడంతో… అవన్నీ ఉత్తమాటలుగా తేలిపోయాయి. కేవలం ప్రకటనల వరకేనని స్పష్టమైంది. ముందుగా వైసిపి కార్యాలయం ధ్వంసంతో ప్రారంభమైన పాలన.. మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇది మరింత ముందుకెళ్తే మాత్రం ప్రమాదకరమే. గత ఐదేళ్లకు మించిన పరిణామాలు చూడక తప్పని పరిస్థితి.

బాపట్ల జిల్లాలో మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తగలబెట్టారు. భట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన పని అని వైసిపి ఆరోపిస్తోంది. అయితేఈ ఘటనకు నిరసనగా వైసిపి నాయకులు,కార్యకర్తలు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇది నిజంగా టిడిపి శ్రేణుల పనా? లేకుంటే ఆకతాయిలు చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

గత ప్రభుత్వం మాదిరిగా విధ్వంసాలు ఉండవని చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. కానీ రాజధాని అమరావతి పరిధిలోని వైసిపి కేంద్ర కార్యాలయ భవన నిర్మాణ పనులను కూల్చివేసింది. తాడేపల్లి లో రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కార్యాలయం నిబంధనలకు విరుద్ధమని సిఆర్డిఏ అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి యంత్రాలతో లోపలికి వెళ్లి నేలమట్టం చేశారు. అక్కడితో ఆగకుండా విశాఖలో కొత్తగా నిర్మితమైన భవనానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. అక్రమ కట్టడం గా పేర్కొన్నారు. అనంతపురం, రాజమండ్రి తో పాటు చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. దీనిపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమైంది.

మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై.. చంద్రబాబు ప్రభుత్వం పునసమీక్షిస్తోంది. ఇందుకుగాను క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది. పాత కేసులను సైతం తిరగతోడే పనిలో పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్, అప్పి రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇలా అందరిపై ఉన్న పాత కేసులను తెరపైకి తెస్తోంది. దీంతో అధికార పార్టీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ప్రజల్లో కూడా చర్చ నడుస్తోంది. ఏపీలో పగ ప్రతీకార రాజకీయాలకు చంద్రబాబుచెక్ చెబుతారని తట్టస్తులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా పరిణామాలు జరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడు తగ్గించాలని కోరుతున్నారు.