Minister Narayana: విద్యారంగంలో తనకంటూ ముద్ర చాటుకున్నారు పొంగూరు నారాయణ. అటు తరువాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి రాణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు నారాయణ. దశాబ్దాల కిందట నారాయణ విద్యాసంస్థలను నెలకొల్పి.. జాతీయస్థాయిలో విస్తరించి.. విద్యారంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. దేశంలో 21 రాష్ట్రాల్లో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు, 60 వేల మందికి పైగా సిబ్బందితో విద్యాప్రస్థానం సాగిస్తోంది. జాతీయ విద్యా సంస్థలలో నారాయణ అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు నారాయణ. సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తెరవెనుక పని చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పొంగూరు నారాయణను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు.ఇప్పుడు మరోసారి నెల్లూరు సిటీ స్థానం నుంచి గెలిచిన నారాయణను తన మంత్రివర్గంలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించారు. అటు పట్టణాభివృద్ధి శాఖగా పదవి నిర్వర్తిస్తూనే.. అమరావతి నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు నారాయణ.
* ఎన్నో కష్టాలను అధిగమించి
తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలను అధిగమించారు. చిన్నపాటి ట్యూషన్ సెంటర్ తో ప్రారంభమైన నారాయణ విద్యాసంస్థల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై అన్న చందంగా దేశంలోనే పేరెన్నిక గల విద్యాసంస్థలు గా రూపుదిద్దుకున్నాయి నారాయణ విద్యాసంస్థలు. అయితే ఇంతటి ప్రస్థానాన్ని సంపాదించిన నారాయణ.. పదో తరగతి ఉత్తీర్ణత సాధించకపోవడం విశేషం. 1972లో పదో తరగతి చదివిన ఆయన తొలి ప్రయత్నంలో తప్పారట. కసితో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి.. పీజీ సైతం పూర్తి చేశారు. విద్యారంగంలో రాణించాలన్న కసితో 1979లో నెల్లూరులో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ సంస్థను ప్రారంభించారు. అనతి కాలంలోనే దేశంలో 21 రాష్ట్రాల్లో విస్తరించింది ఆ సంస్థ.
* భావోద్వేగంతో ప్రకటన
ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓ చోట కార్యక్రమానికి హాజరైన మంత్రి నారాయణ భావోద్వేగంతో మాట్లాడారు. తాను పదో తరగతి తప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కసితో చదివితే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని.. చదువులో రాణించవచ్చని చెప్పుకొచ్చారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచి లక్ష్యాలను అలవర్చుకోవాలని.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మంత్రి నారాయణ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.