Pushpa 2 : ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న సునామీ లాంటి వసూళ్లను భవిష్యత్తులో ఏ హీరో కూడా అందుకోలేరేమో అని అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ ట్రేడ్ పండితులు సైతం అల్లు అర్జున్ స్టార్ డమ్ ని చూసి నివ్వెరపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు టికెట్ రేట్స్ ప్రభావం కాస్త పడిన సంగతి వాస్తవమే. అనేక ప్రాంతాలలో మార్నింగ్ షోస్, మ్యాట్నీ షోస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ నుండి నైట్ షోస్ వరకు బ్రహ్మరథం పెట్టేసారు. ముఖ్యంగా సాయంత్రం షోస్ నుండి అయితే ఢిల్లీ, ముంబై, పూణే, కోల్ కత్తా, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో టికెట్ ముక్క దొరకడం చాలా కష్టమైంది. టికెట్ రేట్స్ 500 , 1000 ,1600 రూపాయిల రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి.
వర్కింగ్ డే రోజు ఈమధ్య కాలం లో ఒక సినిమాకి బాలీవుడ్ లో ఈ స్థాయి వసూళ్లను ఎప్పుడూ చూడలేదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. నిన్న ఒక్క రోజే ఈ సినిమాకి బాలీవుడ్ 58 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. అంటే దాదాపుగా 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం హిందీ వెర్షన్ నుండి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక తమిళనాడులో మొదటి రోజు ఈ చిత్రానికి 10 కోట్ల 72 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రూపాయిల గ్రాస్, కేరళలో 3 కోట్ల రూపాయిలు, కర్ణాటక లో 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మొత్తం మీద ఇండియా వైడ్ గా రెండవ రోజు 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం.
అదే విధంగా ఓవర్సీస్ లో రెండవ రోజు ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 137 నుండి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, రెండు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 424 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ క్లోజింగ్ వసూళ్ల కంటే ఎక్కువని అంటున్నారు. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి ఫుల్ రన్ లో 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దానిని ‘పుష్ప 2’ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే అధిగమించడం అందరినీ షాక్ కి గురి చేసింది. మొదటి వారంలోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.