Minister Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. మరో ఐదు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. కేవలం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంతోనే వాయిదా పడిందని.. ఈసారి ఆ ప్రసక్తి లేదని.. నోటిఫికేషన్ విడుదల చేసి నిర్ణీత వ్యవధిలో డీఎస్సీ భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని లోకేష్ ప్రకటించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా డీఎస్సీ నియామక ప్రక్రియ పై రకరకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి తప్పకుండా నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. ఆ ఏర్పాట్లలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఐదు రోజుల్లో ఏ క్షణం అయినా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read: తమిళనాడు గవర్నర్ గా టిడిపి సీనియర్ నేత!
* ఐదేళ్లలో నిల్
గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నియామక ప్రక్రియ జరగలేదు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి టిడిపి ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ సర్కార్. 6000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపించింది. అంతకుముందు ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని అమలు చేయలేకపోయారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ లో సైతం తక్కువ ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించారు. అది కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ ప్రక్రియ నిలిచిపోయింది.
* మెగా డీఎస్సీ హామీ..
అయితే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు( Chandrababu) హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఫైల్ పై సంతకం చేశారు. ఏకంగా 16,300 కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష సైతం పూర్తి చేశారు. కానీ నోటిఫికేషన్ రాకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూశారు. అయితే ఎస్సీ వర్గీకరణ వల్లే ఇది జాప్యం జరిగింది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ పై కమిషన్ ఏర్పాటయింది. ఆ నివేదిక ఎట్టకేలకు రాగా.. ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్కు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం.
* విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి..
ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంవత్సరం( academic year) ప్రారంభం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్తున్నారు. నిన్ననే మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు స్పెషల్ బిఈడి చేసిన అభ్యర్థులకు గాను నియామక ప్రక్రియ చేపడతారని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అహోరాత్రులు శ్రమిస్తున్న వారు ఉన్నారు.