Rajya Sabha: ఏపీలో ( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచాలని చూస్తోంది. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యింది. ఇంకోవైపు కూటమిలోని మూడు పార్టీలు ఎవరికి వారు బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టులతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలను తమ బలాబలాలను బట్టి పొందుతున్నారు. ఈ విషయంలో చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతోంది కూటమి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే రాజ్యసభకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ తో పాటు షెడ్యూల్ వెల్లడించింది ఈసీ. కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ సీటు కూటమికి ఏకగ్రీవం కానుంది.
Also Read: ఏపీ బీజేపీ చీఫ్ ఆయనే.. సోము వీర్రాజు ఎంట్రీ తో మారిన సీన్
* బిజెపి ది అదే పట్టు..
అయితే ఏపీలోనే రాజకీయ ప్రయోజనాలను మిగతా రెండు పార్టీలకు విడిచిపెట్టింది బిజెపి( BJP). కానీ పార్లమెంటుకు సంబంధించి తమ ముద్ర ఉండాలని చెబుతోంది. రాజ్యసభ విషయంలో తమ పార్టీకి సింహప్రయోజనాలు ఉండాలని భావిస్తోంది. అందుకే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవిని తమకే విడిచి పెట్టాలని కోరుతోంది. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు బిజెపి అగ్ర నేతలు ఇదే విషయంపై చెప్పినట్లు సమాచారం. అయితే బిజెపి నేతృత్వంలోని కేంద్రం సహకారం ఇప్పుడు రాష్ట్రానికి అవసరం. అందుకే ఈ రాజ్యసభ పదవిని బిజెపికి కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. అదే జరిగితే ఏపీ నుంచి రాజ్యసభకు ఇది రెండో పదవి అవుతుంది.
* ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం
అయితే రెడ్డి సామాజిక వర్గానికి( Reddy community) చెందిన వారు విజయసాయి. ఆయన రాజీనామా చేసిన సీటును అదే సామాజిక వర్గం కు ఇవ్వాలని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ముగ్గురు రాజ్యసభ సభ్యులు. ఆ ముగ్గురు బిసి వర్గానికి చెందిన వారే. అయితే వారి స్థానంలో కూటమి తరుపున ఇద్దరు బీసీ నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందుకే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి పదవి కేటాయించాలని బిజెపి భావిస్తోంది. తద్వారా ఏపీలో ఆ సామాజిక వర్గానికి మచ్చిక చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రాయలసీమపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బిజెపి.
* ఇద్దరి మధ్య పోటా పోటీ.. రాయలసీమలో( Raayala Seema) రెడ్డి సామాజిక వర్గం నేతల విషయంలో ఒక జాబితాను రూపొందించే పనిలో పడింది బిజెపి. అయితే ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ల మధ్య రాజ్యసభ పదవికి పోటీ ఉందని తెలుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో కూటమి నేతలు సానుకూలంగా ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ ముఖ్యుల నుంచి మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎంపీ జీవీఎల్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సైతం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంకోవైపు విజయసాయిరెడ్డి బిజెపికి టచ్లోకి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. కానీ లిక్కర్ స్కాంలో ఆయనకు మరోసారి నోటీసు అందింది. ఆయన విషయంలో టిడిపికి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే బిజెపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా.. బిజెపికి రాజ్యసభ పదవి దక్కడం ఖాయమని తేలింది.