Ashok Gajapathi Raju: తమిళనాడు గవర్నర్( Tamil Nadu governor ) గా ఏపీకి చెందిన వ్యక్తి నియమితులవుతారా? కేంద్ర ప్రభుత్వం ఇదే ఆలోచనతో ఉందా? అయితే ఆ నేత ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సాధారణంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి సిఫారసుల మేరకు గవర్నర్ల నియామకం ఉంటుంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రాధాన్యం టిడిపికి దక్కుతోంది. ఈ తరుణంలో కేంద్రం టిడిపికి ఒక గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తమిళనాడు గవర్నర్ విషయంలో రాద్ధాంతం జరుగుతోంది. టిడిపికి చెందిన నేతను గవర్నర్ గా ఎంపిక చేసి తమిళనాడు పంపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ బీజేపీ చీఫ్ ఆయనే.. సోము వీర్రాజు ఎంట్రీ తో మారిన సీన్
* సీనియర్ మోస్ట్ లీడర్..
అశోక్ గజపతిరాజు( Ashok gajpati Raju ) ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేత. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. నిజాయితీగల నేతగా గుర్తింపు ఉంది. విజయనగరం సంస్థానాధిశుడిగా, ప్రముఖ దేవాలయాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా కూడా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజును రంగంలోకి దించారు. అయితే రాజ్యసభకు కానీ.. గవర్నర్ పదవికి కానీ అశోక్ ఎంపిక చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
* ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా..
అశోక్ గజపతి రాజుకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 1978లో తొలిసారిగా జనతా పార్టీ ( Janata Party ) తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983, 1985, 1989, 1994, 1999లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. 2004లో మాత్రం ఓటమి చవిచూశారు. 2009లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 2019లో మాత్రం ఓటమి తప్పలేదు. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏడు సార్లు ఎమ్మెల్యే గాను, ఒకసారి ఎంపీ గాను పదవీ బాధ్యతలు చేపట్టారు అశోక్ గజపతిరాజు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి లభించింది. ఒక్క 2014లో మాత్రం ఆయన కేంద్ర మంత్రి అయ్యారు.
* వైసిపి హయాంలో ఇబ్బందులు..
గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పాలనలో అశోక్ గజపతిరాజు ఇబ్బంది పడ్డారు. ఆయనను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టారు. వాటిని తట్టుకొని నిలబడ్డారు. అయితే పార్టీకి విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. అందుకే ఆయన పెద్దరికాన్ని గౌరవించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రం నుంచి గవర్నర్ పోస్టుకు ప్రతిపాదనలు పంపమని కోరగా.. చంద్రబాబు మాత్రం అశోక్ గజపతిరాజు పేరు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు నియామకానికి సంబంధించి కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: ఆమె విషయంలో తోక ముడిచిన వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా