Minister Atchenaidu : ఏపీలో కూటమి ప్రజాప్రతినిధులు పొదుపు పాటిస్తున్నారు. సభలు, సమావేశాలు అంటూ ఆర్భాటాలు లేవు. ప్రముఖుల సమావేశాలకు జన సమీకరణ కూడా లేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సైతం చాలా సింపుల్ గా జరిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సైతం సాదాసీదాగా ముగుస్తోంది. అయితే ఈ సంస్కృతిని అలవాటు చేసింది మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దుబారా ఖర్చు తగ్గించి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు పవన్. అందుకు తననుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. కీలక ఐదు శాఖల మంత్రిగా ఉన్నా.. డిప్యూటీ సీఎం హోదాతో వ్యవహరిస్తున్నా.. క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ కూడా తానే సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు పవన్. తన క్యాంప్ ఆఫీస్ పై విమర్శలు రావడంతో మార్చేశారు. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ కాదు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు సింపుల్ సిటీని మెంటైన్ చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న ఆలోచన చేశారు. తనకు లభించిన శాలువాలతో విద్యార్థులకు దుస్తులు కుట్టించి అందించారు. చలికాలంలో అవి వారికి ఎంతగానో ఉపయోగపడతాయని భావించి అందించగలిగారు. దీనిపై అభినందనలు వ్యక్తం అయ్యాయి.
* సీనియర్ మంత్రి వినూత్న నిర్ణయం
తాజాగా మంత్రి అచ్చెనాయుడు అటువంటి నిర్ణయమే తీసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకలకు తన వద్దకు బొకేలతో రావద్దని.. పండ్లు తీసుకురావద్దని కార్యకర్తలకు, నేతలకు కోరారు. ఎవరైనా అలా తీసుకురావాలనుకుంటే పెన్నులు, పుస్తకాలతో రావాలని కోరారు. ఇందుకుగాను ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేశారు. కింజరాపు కుటుంబం అంటేనే శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా చూస్తారు. చాలా గౌరవభావంతో మెలుగుతారు. ఏటా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో వారి స్వగ్రామం నిమ్మాడ జనసంద్రంగా మారుతుంది. వేలాదిమంది కార్యకర్తలు, నేతలు, అధికారులు, అనధికారులు, ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు. ఆ సమయంలో వేలాది బొకేలు, టన్నులకొద్ది పండ్లు పోగవుతాయి. అయితే పండ్లు వరకు ఉపయోగపడతాయి కానీ.. బొకేలు మాత్రం నిరుపయోగంగా మారుతున్నాయి. అందుకే అచ్చెనాయుడు ఈసారి బొకేలు బదులు పెన్నులు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. వాటిని పేద విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు. ఆయన ఆలోచనపై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.
* హంగామా వద్దంటున్న ఎమ్మెల్యేలు
అయితే ఈసారి చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ తో పాటు శ్రేణులకు ఇదే సమాచారం అందిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఎటువంటి ఆర్భాటాలు వద్దని కోరుతున్నారు. పదిమందికి పనికొచ్చే పనులు చేయాలని సూచిస్తున్నారు. తమ వద్దకు వచ్చేవారు బొకేలు తేవద్దని, పండ్లు సైతం తీసుకురావద్దని ప్రత్యేకంగా సమాచారం ఇస్తున్నారు. అయితే కూటమి ప్రజాప్రతినిధుల్లో ఈ మార్పును ప్రజలు సైతం ఆహ్వానిస్తున్నారు. దుబారా ఖర్చు తగ్గించడంతో పాటు నాలుగు మంచి పనులకు వాటిని వినియోగించడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు ముందుకు రావడానికి అభినందిస్తున్నారు.