AP Liquor sales : మందు బాబులకు గుడ్ న్యూస్. రెండు రోజులపాటు ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతుంది. దుకాణాలతోపాటు బార్లు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న, జనవరి 1న మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటుంది. కానీ న్యూ ఇయర్ వేడుకలు ఉండడంతో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మందుబాబులకు పండగే. సాధారణంగా గంట పాటు అదనంగా సమయం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈరోజు ఏకంగా మూడు గంటల పాటు అదనంగా సమయం ఇవ్వడం విశేషం.
* పొరుగు మద్యం కట్టడికి
ఇంకోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా బయట రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి రాకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. దాదాపు రెండు రోజులపాటు సరిహద్దుల్లోని చెక్ పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోకి పురుగుమద్యం రాకుండా తనిఖీలను ముమ్మరం చేయాలని ఎక్సైజ్ అండ్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
* గణనీయంగా పెరిగిన అమ్మకాలు
ఇంకోవైపు ఏపీలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 75 రోజుల్లో మొత్తం 26,78,547 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. 83,74, 116 కేసుల మద్యం విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి.. డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి స్టాక్ పంపుతున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ రెండు రోజులపాటు భారీగా మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.