వైసీపీ, జనసేన మధ్య దుమారం రేగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల విషయంలో వైసీపీపై చేసిన విమర్శలతో మంత్రి అనిల్ కుమార్ కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ టికెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల విక్రయంలో ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. చిత్రపరిశ్రమపై ప్రభుత్వం కలగజేసుకోవడం సరికాదని హితవు పలికారు. దీంతో మంత్రులు కూడా తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు.

ఆన్ లైన్ టికెట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయనకెందుకు పట్టింపు అని ప్రశ్నించారు. పరిశ్రమలో ఎందరో ప్రముఖులు ఉండగా పవన్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్నారు. పవన్ కల్యాణ్ నటించినా సంపూర్ణేష్ బాబు నటించినా ఇద్దరిదీ నటనేనన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం ఉండేలా చేయడమే ప్రభుత్వ ఉధ్దేశమని చెప్పారు. పారదర్శకత కోసమే ఆన్ లైన్ పోర్టల్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. సినిమా ఖర్చులో నలుగురైదుగురు మాత్రమే లబ్ధిపొందడం సమంజసం కాదనే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు వివరించారు.
చిత్రసీమను ఇబ్బంది పెట్టడమే పవన్ పనిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే పవన్ ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఉనికి కోసమే పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం సమంజసం కాదని హితవు పలికారు. రెండు జెడ్పీటీసీలు గెలిచినంత మాత్రాన పార్టీ ఏదో పైకి లేచినట్లు బిల్డప్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. టికెట్ల విషయంలో ఇష్టానుసారం పెంచేస్తానంటే కుదరదని సూచించారు. ప్రజలపై భారం పడకుండా ఉండడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలున్నా పవన్ కే ఎందుకు పట్టింపు వచ్చిందని ప్రశ్నించారు. నోరుందని మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు.