AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. మరో ఉపరీతల ఆవర్తనం ఏర్పడనుందని చెబుతోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు దంచి కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి రాయలసీమలోని అనంతపురం వరకు వర్షాలు భారీగానే నమోదయ్యాయి. ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో విపరీతమైన ప్రభావం చూపాయి. అయితే ఇటీవల కొంత తెరిపిచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతం వాయువ్య దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే స్పందించింది. పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేసింది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
* బంగాళాఖాతంలో అల్పపీడనం..
సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం అంటే కోస్తాంధ్రకు విపరీతమైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అయితే వణికి పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలియడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే అల్పపీడన ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. శిధిల భవనాలు కింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని సూచించింది.
* భిన్న వాతావరణం
అయితే వాతావరణం లో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. వేసవిని తలపిస్తున్నాయి ఎండలు. మొన్న ఆ మధ్యన భారీ వర్షాలు నమోదయినా.. వేడి వాతావరణం కొనసాగుతుండడం విశేషం. ఒకవైపు వర్షాలు పడుతున్న ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడం ఏమిటనేది జనాల్లో ఉన్న ఆందోళన. చల్లటి వాతావరణం కనిపించడం లేదు. వాతావరణం లో ఈ భిన్న మార్పులు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఎండల తీవ్రత సైతం కొద్దిరోజులపాటు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* రికార్డు స్థాయిలో వర్షం..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం అయితే విశాఖ జిల్లా పెందుర్తిలో భారీ వర్షం పడింది. ఇక్కడ 80.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అనకాపల్లి జిల్లా కోటపాడు లో 68, గంధవరంలో 61.5, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 55 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది. తాజాగా అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా రికార్డు స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల రెండో వారంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఈ అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అంటే ఈ నెలాఖరు వరకు వానలే వానలు.