TTD EO Anil Kumar Singhal: తిరుమల తిరుపతి దేవస్థానానికి( Tirumala Tirupati Devasthanam) కొత్త అధికారి వచ్చారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. అయితే ఆయన నియామకం వెనుక ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. వాస్తవానికి ఈవో శ్యామల రావు కూడా చంద్రబాబుకు ఇష్టమైన అధికారి. కానీ ఆయన వైసీపీని టీటీడీలో నిలువరించలేకపోయారు అనేది ఒక విమర్శ. దీంతో సహజంగానే ఆయనపై బదిలీ వేటు పడింది. అయితే అనిల్ కుమార్ సింఘాల్ నియామకం వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవో శ్యామలరావు వచ్చి ఏడాదికిపైగా అవుతోంది. కానీ తిరుమలలో వైసీపీ వాసనలు పోలేదని స్పష్టమవుతోంది. అందుకే అనిల్ కుమార్ సింఘల్ ను నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నియామకంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
* ఈవో పోస్ట్ కు డిమాండ్..
సాధారణంగా టీటీడీ ఈవో పోస్ట్ అంటే చాలా గిరాకీ. ప్రతి అధికారి తమ జీవితంలో ఒక్కసారైనా ఈవోగా చేస్తే చాలు అని భావిస్తారు. ఉమ్మడి ఏపీ నుంచి ఈవో పోస్ట్ అంటే ఐఏఎస్ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ కూడా. అయితే తాజాగా 12 మంది ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా పనిచేస్తున్న శ్యామలరావును( Shyamala Rao ) బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ వచ్చారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో కూడా అనిల్ పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పై గట్టిపట్టు ఉంది. అడుగడుగునా అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అటువంటి అధికారి రావడంతో టీటీడీ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అయితే ఆయన నియామకం వెనుక కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* పక్కకు తప్పించిన వైసిపి..
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉండేది. ఈ క్రమంలోనే అప్పట్లో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్( Anil Kumar Singhal ) నియమితులయ్యారు. అయితే వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను తొలగించారు. అక్కడ నుంచి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. అయితే తాజా నియామకాలు మళ్లీ ఏపీ ప్రభుత్వం ఆయనకు టీటీడీ ఈవోగా అవకాశం ఇచ్చింది. అయితే ఆయన రాకతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన ఏడాది కాలంలో సైతం వైసీపీ హవా తిరుమలలో నడిచింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ ఈ నియామకం చేపట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. టిటిడి పై వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తే అనిల్ కుమార్ ఊరుకోరు. నేరుగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి గట్టి చర్యలే చేపడుతారు. పైగా తనను అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్న కోపం కూడా ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆపై ఆయన వెనుక అమిత్ షా ఉండడం కలిసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఆ సమన్వయం లేనందున..
వాస్తవానికి టీటీడీ ఈవో శ్యామలరావును ఏరి కోరి తెచ్చుకున్నారు సీఎం చంద్రబాబు. ఏడాది కిందట ఆయన నియమితులయ్యారు. కనీసం రెండు సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారని అంతా భావించారు. కానీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల సమయంలో తొక్కిసలాట జరిగింది. టీటీడీకి మాయని మచ్చగా మారింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో తన సమక్షంలోనే ఈవో శ్యామలరావు వాదనకు దిగడం చంద్రబాబుకు నచ్చలేదు. గోశాలలో గోవులు చనిపోయాయి అంటూ వైసిపి దుష్ప్రచారం చేసింది. దానిని కూడా శ్యామలరావు అడ్డుకోలేకపోయారు. చైర్మన్ నాయుడుతో సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. అందుకే అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించినట్లు తెలుస్తోంది. టీటీడీ ప్రక్షాళనకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి ఏం జరుగుతుందో