Merger of TDP with BJP : మొన్నటివరకూ బీజేపీ కోసం చంద్రబాబు పడిన ఆరాటం చూస్తే గుండె తరుక్కుపోతుంది. నాలుగేళ్లుగా కళ్లు కాయలు కాచేలా అగ్రనేతల ప్రాపకం కోసం చూశారు. నీతి ఆయోగ్, జీ20 సన్నాహక సమావేశాలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందేసరికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. కర్నాటక ఎన్నికల తరువాత తనపై కాస్తా మెత్తబడ్డారని తెలిసి చంద్రబాబు కాస్తా ఆనందంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వదినమ్మ పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు రావడంతో ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే తాను వద్దనుకున్న సోము వీర్రాజు అవుట్ కావడం మాత్రం చంద్రబాబుకు కాస్తా ఉపశమనం కలిగించే విషయమే.
గత ఎన్నికల్లో ఇలా ఓటమి ఎదురైందో లేదో..తనకున్న నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారు చంద్రబాబు. తనపై బీజేపీ హైకమాండ్ కత్తి కట్టకుండా ముందుగానే కట్టడి చేసుకున్నారు. తనకున్న చిన్నపాటి బలంతో బీజేపీ అడగకుండానే ఎదురెళ్లి మరీ సాయం చేశారు. ప్రతీ అడుగు బీజేపీ కోసమేనన్నట్టు చంద్రబాబు వ్యవహరించారు. అయితే నాలుగేళ్లుగా చంద్రబాబుకు నేరుగా అగ్ర నాయకుల అపాయింట్ మెంట్ దొరకడం గగనంగా మారింది. అయితే మధ్యలో మాత్రం టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే ఆలోచిస్తామని అగ్రనేతల నుంచి ఒక టాక్ వచ్చినట్టు ప్రచారం సాగింది. ఏకంగా చిన్నబాబు లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో ఇదే విషయం చర్చించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఈ అంశం మరుగునపడిపోయింది.
అయితే ఇప్పుడు పురంధేశ్వరికి పగ్గాలు ఇవ్వడంతో మరోసారి టీడీపీ విలీన ప్రక్రియ అంశం తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. ఇదే విషయం బీజేపీ అగ్రనేతలకు చెబితే ఒక షరతు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఎదురైతే పార్టీని బీజేపీలో కలపాలన్నది ఆ షరతు. దీనికి చంద్రబాబు సైతం సమ్మతించినట్టు తెలుస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ కుమార్తెకు ముందుగానే పగ్గాలు అప్పగించడం ద్వారా మార్గాన్ని మరింత సునాయాసం చేసుకున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో అన్నది తెలియాల్సి ఉంది.