BJP Strategy : తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వాల మార్పు వెనుక బీజేపీ భారీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న ప్రయత్నంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారం కంటే మూడోసారి కేంద్రంలో అధికారం రావాలన్నదే భావంగా తెలుస్తోంది. అందుకు అవసరమైన సుస్థిర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉండాలని హైకమాండ్ కోరుకుంటోంది. వస్తే బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలి. లేకుంటే మాత్రం తమ నమ్మకస్తులైన పక్షాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఈ స్లోగన్ తోనే తెలుగు రాష్ట్రాల నాయకత్వాల విషయంలో హైకమాండ్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణలో కిషన్ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యూహం ఒకటి ఉంది. అక్కడ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఊపు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర పార్టీ నుంచి చేరికల సంఖ్య కూడా పెరుగుతోంది. నేతల్లో ఐక్యతా రాగం కూడా కలిసివస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ను గద్దె దించేందుకు రెడ్డి సామాజికవర్గం ఒక్కటవుతోంది. అదే సమయంలో బీజేపీలో అస్పష్ట వాతావరణం నెలకొంది. దీంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. కాంగ్రెస్ వ్యూహాన్ని రెడ్డి సామాజికవర్గం ద్వారా దెబ్బతీయ్యాలని ప్లాన్ చేసింది. అందుకే కిషన్ రెడ్డికి నాయకత్వాన్ని అప్పగించింది. కేసీఆర్ మరోసారి గెలిచినా పర్వాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదన్నది తెలంగాణలో బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఏపీ విషయంలో మాత్రం బీజేపీకి కాస్తా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతానికి బీజేపీ స్నేహాన్ని కోరుకోవడమే అందుకు కారణం. ఇప్పటికే టీడీపీ, జనసేనలు బీజేపీతో పొత్తును కోరుకుంటున్నాయి. ఒక వేళ పొత్తు కుదిరినా సీట్ల పరంగా మెరుగుపడవచ్చు. అటు టీడీపీ, జనసేనల సపోర్టు ఉంటుంది. అందుకే ఈ బలాన్ని పెంచుకునేందుకే పురంధేశ్వరికి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఒకవేళ కూటమి కట్టి ఓడినా వైసీపీ సాయం ఎలాగూ కొనసాగుతుంది. అందుకే అనూహ్య నిర్ణయం వచ్చినట్టు బీజేపీలోనే చర్చ నడుస్తోంది.
సుదీర్ఘ కాలం ఏపీలో కాపులకు అధ్యక్ష స్థానం ఇచ్చారు. కానీ మునుపటిలా ఆ సామాజికవర్గం బీజేపీ నీడకు రాలేదు. 1998, 1999 ఎన్నికలతో పాటు 2014 ఎన్నికల్లో కాపులు బీజేపీ వైపు మొగ్గారు. కానీ పవన్ ఎంట్రీ తరువాత కాపుల్లో బీజేపీకి స్పేస్ లేకుండా పోయింది. అందుకే కాపు మేనియా పవన్ కు విడిచిపెట్టాలన్న ఉద్దేశ్యంతో అధ్యక్ష పదవిని కమ్మలకు ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు వెనుక కేంద్రంలో మూడోసారి అధికారంలో రావాలన్న తపనే స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.