Criticisms On Jagan: విలువలు లేవు. వలువలు కూడా లేదు. ఆధారంతో పనిలేదు. అనుకున్నది చెప్పేయడమే. నోటికి వచ్చింది వాగేయడమే. చెప్పింది మాత్రమే నిజం అని ప్రచారం చేయడమే. ప్రచారం పూర్తయితే చాలు మన బాధ్యత పూర్తయిందని జబ్బలు చరుచుకోవడం నేటి కాలంలో సర్వసాధారణంగా మారింది. దీనినే నిజమైన పాత్రికేయం అనే దిక్కుమాలిన సూత్రీకరణ కూడా ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీనిని ఏ తరహా పాత్రికేయం అంటారో.. ఎలాంటి విలువల సారం అంటారో వార్తలు చదువుతున్న పాత్రికేయులకు.. వార్తలు రాస్తున్న విలేకరులకు.. పాటని ప్రసారం చేస్తున్న యాజమాన్యాలకే తెలియాలి. వాస్తవానికి ఇలాంటి ప్రచారాల వల్ల యాజమాన్యాలకు లక్ష్యాలు నెరవేరుతాయి గాని.. అంతిమంగా సమాజం సర్వనాశనం అవుతుంది.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
తెలుగులో మీడియా అనేది వర్గాలుగా విడిపోయి చాలా సంవత్సరాలు దాటిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పార్టీలకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు ఏర్పాటయ్యాయి. నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాయి. ఈ విలువల పతనం ఎంతవరకు సాగుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే విజయవంతంగా నడుస్తోంది. అధికార పార్టీకి డప్పు కొట్టే చానల్స్ కొన్ని ఉంటాయి.. ప్రతిపక్ష పార్టీకి బాజా వాయించే చానల్స్ మరికొన్ని ఉన్నాయి . ఇక పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఛానల్ లో పనిచేసే సీనియర్ పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. పైగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి. వాటికి ఆధారాలు ఉన్నాయా? ఏ విధంగా వాటిని చేశారు? అనే విషయాలను ఆయన పక్కన పెట్టారు. ప్రాంప్టర్ తో సంబంధం లేకుండానే ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఒక వ్యక్తిని అంతగనం తిట్టడానికి.. అంతగా దూషించడానికి మీడియాను వేదికగా చేసుకోవడం దురదృష్టకరం…
ఇంతకీ ఆ చానల్లో పని చేసే విలేకరి అంటున్న మాటలు ఏంటంటే.. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ప్రజలలోకి వస్తున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చావు దెబ్బ తిన్నది కాబట్టి.. క్యాడర్ మొత్తాన్ని కాపాడుకోవడానికి ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి ప్రయత్నం చేయకుండా నాయకుడు కూడా ఉండలేరు. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాజకీయ నాయకులు అంత సులువుగా ఊరుకోరు. మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో జగన్ కూడా ఒకరు. జగన్ ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. ఒకరకంగా తాను కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి.. ఇందులోను ఓటమి అనేది లేని రాజకీయ నాయకుడు కాబట్టి సహజంగానే ప్రజలో అతడికి చరిష్మా ఉంటుంది. పైగా ఏపీ యువతలో జగన్ అంటే విపరీతమైన క్రేజీ ఉంది. జగన్ ఎక్కడికి వచ్చినా వారు వెళ్తూనే ఉంటారు. ఇది తప్పు కాదు. తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఓ ఛానల్ లో పనిచేసే విలేకరి మాత్రం జగన్ పర్యటనలకు వచ్చేవారిని ఆంధ్రవారు కాదని తేల్చేశారు. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చారని.. మొత్తంగా తన పర్యటనలకు జనం భారీగా వస్తున్నారని ప్రజలను నమ్మించడానికి జగన్ ఏకంగా 15,000 మందిని నియమించుకున్నారని.. అందులో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఉన్నారని ఆ విలేఖరి మొహమాటం లేకుండా చెప్పేశారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆయన అంతరార్థం ఏమిటో అర్థం కాకపోయినప్పటికీ.. ఇలాంటి విమర్శలు చేసినప్పుడు కచ్చితంగా వాటికి ఆధారాలు చూపించాలి. అలాంటి ఆధారాలు చూపించనప్పుడు క్షమాపణ చెప్పాలి.
ఒకవేళ ఆయన చెప్పినట్టు మయన్మార్ నుంచి రోహింగ్యాలు వచ్చి ఉంటే.. ఆ విలేఖరి పనిచేసే ఛానల్ అనుకూల ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం ఆ వ్యక్తులను అరెస్ట్ చేయవచ్చు కదా.. వారిని అదుపులోకి తీసుకొని జైల్లో వేయవచ్చు కదా.. ఆ పని ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు ఏడాది పూర్తయింది కదా.. పైగా జగన్ అక్రమాలపై ప్రభుత్వం వివిధ కేసులు నమోదు చేస్తున్నప్పుడు.. వీరిని మాత్రం ఎందుకు ఉపేక్షిస్తున్నది.. జగన్ పర్యటనలకు వేరే ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చినప్పుడు.. వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు కచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా.. అలాంటిదేమీ జరగడం లేదంటే కచ్చితంగా ఆ విలేకర్ చెప్పినవన్నీ అబద్ధాలు. అడ్డగోలు వ్యాఖ్యలు. ఇలాంటివే జనాల్లో లేని చర్చను తెరపైకి తీసుకొస్తాయి. జగన్ కు ఊహించని బలాన్ని ఇస్తాయి. 2019లో జరిగింది ఇదే. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వార్తలు చదివితే బాగుంటుంది. లేకుంటే 2029లో ఫలితం వేరే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.