Pakistan Army Chief’s luxury foreign tours: ఆర్థిక ఇబ్బందులు.. అప్పులు పెరుగుతంటే.. సాధారణంగా ఎవరైనా పొదుపు మంత్రం పాటిస్తారు. దుబారా తగ్గించుకుంటారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వృథాను తగ్గిస్తున్నారు. ఇందుకోసం డోజ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ) ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ మాత్రం.. దుబారా ఖర్చులతో జనాగ్రహానికి గురవుతోంది.
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వేళ, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ విదేశీ పర్యటనలు, విలాసవంతమైన ఖర్చులు ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశంలో ప్రజలు కనీస అవసరాల కోసం పోరాడుతుంటే, సైనిక ఉన్నతాధికారులు ప్రత్యేక హక్కులు, ఖరీదైన పర్యటనలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. సైనికాధికారి మునీర్ ఇండోనేషియా, శ్రీలంక పర్యటనలు, వాటి ఖర్చులు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
దౌత్యం పేరిట దుబారా..
మునీర్ ఈ నెల చివర్లో ఇండోనేషియాకు, జూలై 20 నుంచి 23 వరకు శ్రీలంకకు పర్యటనలు చేయనున్నారు. ఈ పర్యటనలు దౌత్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నప్పటికీ, విలాసవంతమైన ఏర్పాట్లు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ రైడ్స్, బైక్ ఎస్కార్ట్‌లు, ఫైవ్–స్టార్ హోటల్ బసలు పాక్ ప్రజలలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మే 2025లో జరిగిన ఒఐసీ సమావేశంలో కాశ్మీర్ అంశంపై ఇస్లామాబాద్ ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో, ఈ పర్యటనలు దౌత్య ప్రాధాన్యత కంటే విలాసవంతమైన ఖర్చులపైనే దృష్టి సారిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే ఐఎంఎఫ్ ఆంక్షలు..
పాకిస్తాన్ ఆర్థిక స్థితి దయనీయంగా ఉంది. 2024–25 ఆర్థిక సర్వే ప్రకారం, ప్రభుత్వ ఆదాయంలో సగానికి పైగా అప్పుల వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరవడుతున్నాయి. ఐఎంఎఫ్ కఠిన ఆంక్షల కారణంగా మంత్రులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు నిలిపివేయబడ్డాయి. అయితే, మునీర్ విదేశీ పర్యటనలకు భారీ ఖర్చులు చేయడం, అమెరికాలో హై–ఎండ్ షాపింగ్ మాల్‌లో కనిపించడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. పెరిగిన ద్రవ్యోల్బణం, తగ్గిన ఆదాయాల మధ్య ప్రజలు కనీస అవసరాలకు నోచుకోలేని పరిస్థితుల్లో, సైనిక ఉన్నతాధికారుల దుబారా ఖర్చులు ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి.
రాజకీయ, సైనిక హక్కులపై చర్చ..
పాకిస్తాన్‌లో ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కులు, సైనిక ఖర్చులు ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఐఎంఎఫ్ నుంచి బిలియన్ డాలర్ల రుణం పొందినప్పటికీ, చట్టసభ సభ్యుల వేతనాలు 500 శాతం పెంచడం ప్రజలలో అసంతృప్తిని మరింత పెంచింది. సైనిక ఖర్చులు, ఉన్నతాధికారుల విలాసవంతమైన జీవనశైలి దేశ ఆర్థిక స్థితికి విరుద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి పాకిస్తాన్‌లో ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ విధానాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.