AP Liqueor Policy : వందల్లో దరఖాస్తులు.. వచ్చినవి ఒకటి, రెండు.. మద్యం వ్యాపారులకు బ్యాడ్ లక్!

ఉన్నది పాయే.. ఉంచుకున్నది పాయే అన్నట్టు ఉంది కొందరు మద్యం వ్యాపారుల పరిస్థితి. మద్యం వ్యాపారంతో కోట్లాది రూపాయలు అర్జించాలని వందలాది దరఖాస్తులు చేసుకున్నారు కొంతమంది. కానీ ఒకటి రెండు షాపులు మాత్రమే దక్కించుకున్నారు. నాన్ రిఫండబుల్ రుసుము రూపంలో కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు.

Written By: Dharma, Updated On : October 15, 2024 10:30 am

AP Liqueor Policy

Follow us on

AP Liquor Policy : మద్యం వ్యాపారంతో లాభాలు అర్జించాలని చాలామంది భావించారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు అన్న వెసులుబాటుతో.. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి దరఖాస్తులు వేశారు. కానీ అందులో కొందరికి లక్ తగిలింది. ఎక్కువమందికి బ్యాడ్ లక్ వెంటాడింది. లాటరీలో షాపులు దక్కిన వారుఆనందంతో ఉండగా.. రానివారు మాత్రం కాస్త బాధపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వ్యాపారులు వందల్లో దరఖాస్తు చేసుకోగా.. సింగిల్ డిజిట్స్ లో కూడా షాపులు రాని వారు ఉన్నారు. కొందరైతే వందకు పైగా దరఖాస్తులు చేసుకున్నా.. షాపులు దక్కని బారు సైతం ఉన్నారు. ఒక వ్యాపారి అయితే 480 షాపులకు దరఖాస్తులు చేస్తే కేవలం 11 షాపులు మాత్రమే దక్కాయి. విజయవాడకు చెందిన మరో వ్యాపారి 360 దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు లాటరీలో కేవలం ఐదు షాపులు మాత్రమే దక్కాయి.అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు కలిసి సంయుక్తంగా 172 షాపులకు దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం రెండు షాపులు మాత్రమే దక్కాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత స్నేహితుడు 112 షాపులకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ కేవలం రెండు షాపులు మాత్రమే వచ్చాయి. ఇలా చాలామంది వ్యాపారులు కోట్లాది రూపాయలు దరఖాస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టారు. కానీ షాపులు మాత్రం దక్కలేదు.

* కొత్తగా చాలామంది దరఖాస్తు
అయితే ఈసారి భిన్నంగా మద్యం వ్యాపారులే కాదు సామాన్యులు సైతం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆడిటర్లు, వైద్యులు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. కానీ కొందరికే షాపులు దక్కాయి. విశాఖలో నోయిడా కి చెందిన కొంతమంది వ్యాపారులు కలిసి 250 దరఖాస్తులు చేసుకున్నారు. కానీ వారికి కేవలం 15 షాపులు మాత్రమే వచ్చాయి. విశాఖ జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి తన సిండికేట్ తో కలిసి 168 దరఖాస్తులు చేసుకున్నాడు. 11 షాపులు వచ్చినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లాలో కొందరు వ్యాపారులు 100 షాపులకు దరఖాస్తు చేసుకుంటే నాలుగు దక్కాయి. విజయనగరం జిల్లాలో ఒక వ్యక్తి 40 దరఖాస్తులు చేసుకున్నాడు. ఒక్క షాపు కూడా దక్కలేదు.

* ఇతర రాష్ట్రాల వారు
అయితే ఈసారి సరిహద్దు జిల్లాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున షాపులు దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చాలా షాపులను ఒడిస్సా వ్యాపారులు, నాయకులు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన వ్యాపారులు షాపులు దక్కించుకున్నారు. అయితే స్థానిక అధికార పార్టీ నాయకులు ఇతర రాష్ట్రాల వారితో ఒక వ్యూహాత్మకంగా దరఖాస్తులు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికైతే మద్యం దరఖాస్తులు.. చాలామందికి బ్యాడ్ లక్ ను మిగిల్చాయి.