Nara Lokesh: పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేం. అమ్మకూడదు కూడా. అదే కట్టలమ్మినచోట పూలు అమ్మవచ్చు. అది గౌరవం కూడా. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ నోటితో అయితే నారా లోకేష్ ను విమర్శించారో.. అదే నోటితో శభాష్ అంటున్నారు. అంతర్గత చర్చల్లో కూడా దానిని అంగీకరిస్తున్నారు చాలామంది. పెద్దవారి విషయంలో గౌరవభావంతో.. పార్టీ కార్యకర్తల విషయంలో మమేకమై పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాలనలో కూడా తనదైన మార్క్ చూపుతున్నారు. ఎలాంటి లోకేష్ ఎంతలా మారిపోయారన్న టాక్ అంతటా వినిపిస్తోంది అంటే.. లోకేష్ తన శక్తిని, యుక్తిని ఏ స్థాయిలో పెంచుకున్నారో ఇట్టే అర్థమవుతోంది. రాజకీయంగా విమర్శించవచ్చు కానీ.. లోకేష్ పనితీరుపై వైసీపీ శ్రేణులే ఇప్పుడు ముచ్చట పడుతున్నాయి.
* వైసిపి ప్రథమ బాధితుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధమ బాధితుడు నారా లోకేష్. చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయనపై జరిగిన వ్యక్తిగత దాడి అంతా కాదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఆయనపై వచ్చేవి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగారు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలిగారు. అదే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కీలక మంత్రిగా వ్యవహరించి విదేశీ పెట్టుబడులను తీసుకొస్తున్నారు. ఆ విషయంలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు నారా లోకేష్. ఎవరికైనా వారసత్వ రాజకీయాలు ఎదుగుదలకు పనికొస్తాయి. కానీ నారా లోకేష్ కు మాత్రం రాజకీయ వారసత్వం అనేది ప్రత్యర్థులకు టార్గెట్ గా మారింది. వాటన్నింటినీ ఛేదించి బయటపడుతున్నారు లోకేష్.
* మిగతా వారసులకు భిన్నంగా..
తెలంగాణలో కేటీఆర్, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వారి వారి పార్టీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. వారి తండ్రుల కంటే లోకేష్ తండ్రి చంద్రబాబు సీనియర్. అయినా సరే రాజకీయ ఇబ్బందులు వారి కంటే ఎక్కువగా ఎదుర్కొన్నారు నారా లోకేష్. అందుకే పరిపక్వత చెందారు. వ్యక్తిగత టార్గెట్ ను విజయ సోపానాలుగా మార్చుకున్నారు. కేటీఆర్, ఉదయనిధి స్టాలిన్ కు భిన్నంగా వెళుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వారు ఆయనను గౌరవించడం, ఆకాశానికి ఎత్తడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతర్గత చర్చల్లో లోకేష్ గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. మొన్ననే పదో తరగతి ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను హైలెట్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయడం చిన్న విషయం కాదు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పత్రికల్లో ప్రకటనల రూపంలో యాడ్లు ఇవ్వడం గొప్ప విషయం గానే చెబుతున్నారు. లోకేష్ నాయకత్వం చంద్రబాబుకు మించి పోతుందన్న ఆందోళన కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.