https://oktelugu.com/

Nara Lokesh : టెస్లా సిఎఫ్ఓకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన లోకేష్.. అమెరికాలో ఏం చేశాడంటే

నారా లోకేష్ దూకుడు పెంచారు.ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు నడుం బిగించారు.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలను రప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 28, 2024 / 11:53 AM IST

    Nara Lokesh

    Follow us on

    Nara Lokesh : అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు అభిమానుల తాకిడి కూడా అధికంగా ఉంది. చాలామంది ఎన్నారై ప్రముఖులు వచ్చి నారా లోకేష్ ను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు లోకేష్. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఔత్సాహికులకు విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన అన్ని రకాల వసతులు సమకూర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అందులో భాగంగా అస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో టెస్లా ప్రధమ వరుసలో ఉంది. అందుకే టెస్లాను ఏపీకి రప్పించేందుకు లోకేష్ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. టెస్లా సి ఎఫ్ ఓ వైభవ్ తనేజాతో లోకేష్ భేటీ అయ్యారు. వైభవ్ తనేజా మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజీలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంటి నుంచి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజీ పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ సింగిల్స్, డ్రైవింగ్ ఇన్నోవేషన్, మోడల్ 3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధన రంగంలో స్థిరమైన వృద్ధి సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. గత ఏడాది 18.8% వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్ బిజినెస్ తో.. 97 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు చెప్పారు. దీనిపై లోకేష్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో సైతం మీలాంటివారు వస్తే ప్రజలకు మంచి జరగడంతో పాటు రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

    * ఎనర్జీ ఉత్పత్తులకు ప్రాధాన్యం
    ఏపీలో సైతం ఎనర్జీ ఉత్పత్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 2029 నాటికి 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమలు అభివృద్ధి సాధించాయి. కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించారు. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించారు. ఈ తరుణంలో టెస్లా ఏపీకి వస్తే అన్ని రకాల సముచిత స్థానం కల్పిస్తామని లోకేష్ సిఎఫ్ఓ కు హామీ ఇచ్చారు.

    * అనంతపురంలో పరిశ్రమ
    ముఖ్యంగా అనంతపురం జిల్లాలో టెస్లా ఇవి తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్లు ఏర్పాటుకు సరైన ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పై సైతం కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులకు సంబంధించి టెస్లా ఆసక్తి చూపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ వెళ్లి సిఎఫ్ఓతో చర్చలు జరపడం విశేషం. త్వరలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఒప్పందాలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతుండడం శుభపరిణామం.