Nadendla Manohar: తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు లైన్ క్లియర్

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా కూడా పదవి చేపట్టారు.

Written By: Dharma, Updated On : February 21, 2024 10:37 am
Follow us on

Nadendla Manohar: ఏపీలో తెనాలి అసెంబ్లీ సీటు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి బరిలో తిరుగుతారా? లేకుంటే జనసేన పోటీ చేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు ఇక్కడ టిక్కెట్లు ఆశిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఈ నియోజకవర్గ విషయంలో స్పష్టత ఇచ్చినట్లు వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారింది.

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా కూడా పదవి చేపట్టారు. 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై మనోహర్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ వైసిపి అభ్యర్థి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు నాయకులు ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. కానీ పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఇక్కడ ఛాన్స్ దక్కుతుంది అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

అయితే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు గుంటూరు పార్లమెంట్ స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలనుంచి నిష్క్రమించారు. బలమైన అభ్యర్థి ఇక్కడ అవసరం. కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే తనకు తెనాలి సీటు కావాలని ఆలపాటి పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పవన్ సైతం జనసేన నేతల వద్ద తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు తాజాగా నారా లోకేష్ సైతం తెనాలి సీటు నాదేండ్ల మనోహర్ దేనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు పార్లమెంట్ స్థానానికి షిఫ్ట్ అవుతారా? తీసుకుంటారు? అన్నది తెలియాల్సి ఉంది.