Investments: మూడు నెలల్లో తెలంగాణకు 6000 కోట్లు.. మరి ఐదేళ్లలో ఏపీకి ఎంత?

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి మూడు నెలలు అవుతోంది. ఆ రాష్ట్రానికి ఇప్పటివరకు 6000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : February 21, 2024 10:42 am

Investments

Follow us on

Investments: ఏపీలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రదాన్యం ఇస్తూ పాలన చేస్తున్నామని వైసిపి సర్కార్ చెబుతోంది. సంక్షేమం వరకు ఓకే కానీ.. అభివృద్ధి విషయంలో మాత్రం జగన్ సర్కార్ వెనుకబడి ఉందని అపవాదు ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతి లేదని స్పష్టమవుతోంది. పారిశ్రామికంగా రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? వాణిజ్య సంస్థలు, ఐటీ కంపెనీలను ఆకర్షించ గలిగారా? అంటే మాత్రం మౌనమే సమాధానం అవుతుంది. కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా.. ఉన్న పరిశ్రమలను తరిమేశారన్న విమర్శ జగన్ సర్కార్ పై ఉంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి మూడు నెలలు అవుతోంది. ఆ రాష్ట్రానికి ఇప్పటివరకు 6000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టి 15 రోజులకి తన బృందంతో కలిసి దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లారు. రాష్ట్రానికి 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించుకున్నారు. అంతకుముందు కెసిఆర్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం గౌరవించారు. రెన్యుసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో కెసిఆర్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. దీనిని సాధించేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సంస్థను సాదరంగా రాష్ట్రానికి ఆహ్వానించింది. సదరు సంస్థ ఆరువేల కోట్ల రూపాయలతో తెలంగాణలో అతి పెద్ద సోలార్ పివి మాడ్యూల్స్, టీవీ సెల్స్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది.

కేవలం మూడు నెలల వ్యవధిలోనే 6000 కోట్ల రూపాయలతో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయించడం రేవంత్ సర్కార్ సాధించిన విజయం. మరి ఆ లెక్కన జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎంత సాధించాలి? ఎంత సాధించారు? కొత్త వాటిని తీసుకురాక పోగా అమర్ రాజా బ్యాటరీస్, లూలు గ్రూప్ వంటి అనేక సంస్థలను బయటకు వెళ్లిపోయేలా చేశారని వైసీపీ నేతలపై ఒక విమర్శ ఉంది. పారిశ్రామిక ప్రగతి లేకుండా పోయింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో వారంతా పక్క రాష్ట్రాలకు ఉపాధి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు.

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై సమీక్షలు చేసింది. అడ్డగోలుగా రద్దు చేసింది. కనీసం అందులో మంచి ప్రాజెక్టులను పట్టాలెక్కించి ఉంటే పారిశ్రామిక ప్రగతి సాధించి ఉండేది. భక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకుండా పక్కన పడేస్తే ఆ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా మారుతుందో ఏపీని చూస్తే ఇట్టే అర్థమయిపోతుంది. గత ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుని కొనసాగిస్తే అభివృద్ధి ఫలాలు అందేవి. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవీ చేయకుండా ఐదేళ్ల పాలనను జగన్ సర్కార్ పూర్తి చేసుకోవడం ఈ రాష్ట్రానికి శాపంగా మారింది.