LG Polymers: రాష్ట్ర చరిత్రలోనే ఎల్జి పాలిమర్స్ ప్రమాద ఘటన పెద్దది. విశాఖలోని ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువు లీకై 12 మంది మృత్యువాత పడ్డారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాల్సింది పోయి.. యాజమాన్యానికి కొమ్ము కాసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇటు ప్రజలతోపాటు అటు ఎల్జి పాలిమర్స్ కంపెనీ తో కూడా జగన్నాటకం ఆడిన తీరు చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కంపెనీ ముందుకు వచ్చింది.మృతుల కుటుంబాలకు సత్వర న్యాయం,పరిహారం అందించేందుకు సిద్ధపడింది.అదనపు పరిహారంగా 120 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముందుకు రావడం విశేషం.దాదాపుఈ కంపెనీ బాధిత కుటుంబాలు 5000 వరకు ఉన్నాయి.వారందరి కోసం ఈ మొత్తం ఉపయోగించాలని ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం మారిన తర్వాత పరిశ్రమ యాజమాన్యం తీరు మారడం కూడా విశేషం.
ఎల్జి పాలిమర్స్ ఘటనలో వైసిపి ప్రజాప్రతినిధులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందినంత దండుకొని ఆఖరి నిమిషంలో యాజమాన్యానికి సైతం మోసం చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా నాలుగేళ్ల కిందట విషవాయువులు వెదజల్లి 12 మంది ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. దీంతో సదరు యాజమాన్యం పరిశ్రమను విశాఖ నుంచి తరలిస్తామన్నా వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.ఘటన జరిగిన వెంటనే అప్పటి సీఎం జగన్ స్పందించారు. చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున, అస్వస్థతకు గురైన వారికి 25 వేలు చొప్పున, ఐదు గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అస్వస్థతకు గురైన చాలామందికి సాయం అందలేదు. విష వాయువుల ప్రభావం జీవితాంతం ఆ గ్రామాలపై ఉంటుందని నిపుణులు సైతం హెచ్చరించారు. దీంతో అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వైసిపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. బాధిత గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు ఇచ్చి.. జీవితాంతం వారికి ఉచితంగా వైద్యం చేస్తామని కూడా చెప్పారు. ఆసుపత్రి కట్టలేదు సరి కదా వారికి చికిత్స కూడా అందించలేదు. ప్రమాదం జరిగిన నెలలోనే మరో ముగ్గురు చనిపోతే వారికి పరిహారం ఇవ్వలేదు.
ఎల్జి పాలిమర్స్ కంపెనీ దక్షిణ కొరియాకు చెందినది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ దేశానికి చెందిన ఎల్జీ పాలిమర్స్ ఎండి, సీఈఈ, మరో ఇద్దరు డైరెక్టర్లను అరెస్టు చేశారు. కానీ కొద్ది రోజులకే వారు త్వరగా బయటపడి స్వదేశాలకు వెళ్లిపోయేందుకు వైసిపి ప్రజాప్రతినిధులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈ పరిశ్రమ స్థానికంగా నిర్వహించవద్దని కోరుతూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ పరిశ్రమ శ్రీ సిటీకి తరలిస్తామని యాజమాన్యం ముందుకు వస్తే అనుమతులు మంజూరు చేసింది వారే. అడ్డంకులు సృష్టించింది కూడా వారే. ఒకవైపు కోర్టు కేసులు నడుస్తుండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఎల్జి పాలిమర్స్ కంపెనీకి సంబంధించి అన్ని రకాల నిర్ణయాలు ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం పోలీసులతో చార్జి షీట్ కూడా వేయించలేదు. అలా వేసి ఉంటే కేసు ముగిసిపోయి ఆ సంస్థ ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోయేది. కానీ అప్పటి వైసిపి పాలకుల్లో కొంతమంది ఎల్జి పాలిమర్స్ ను తమ జేబు సంస్థ గా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇండియాలో ఎల్జి పాలిమర్స్ ఘటనకు సంబంధించి దక్షిణ కొరియా మ్యాగజైన్ ఒకటి ప్రత్యేక కథనం ప్రచురించింది. అదే సమయంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఎల్జి పాలిమర్స్ యాజమాన్యం స్పందించింది. తమ కంపెనీ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు సిద్ధపడింది. స్థానికుల కోరిక మేరకు పరిశ్రమను నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీకి తరలించేందుకు సైతం సిద్ధంగా ఉంది. కోర్టు తీర్పు మేరకు విశాఖ ప్లాంట్ ను పర్యావరణ హిత ఉత్పత్తుల కోసం వినియోగించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు నేరుగా కలిసి చెప్పారు ఆ కంపెనీ ప్రతినిధులు. పరిశ్రమలో ప్రమాదం జరిగిన తర్వాత ఇదే తరహా ప్రతిపాదనలతో ముందుకొచ్చినా.. వైసీపీ సర్కార్ పెద్దగా స్పందించలేదన్నది ఎల్జి పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు చేస్తున్న విమర్శ. కేవలం కొత్త ప్రభుత్వం మారిన తరువాత మాత్రమే.. ఎల్జి పాలిమర్స్ ఘటనకు సంబంధించి పరిణామాలు మారాయి. సంబంధిత కంపెనీ సైతం చొరవ చూపింది. ఇదే ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Lg chem company promises to give extra rs 120 crores in aid over lg polymers gas leak victims
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com