Homeఆంధ్రప్రదేశ్‌LG Chem Company: విశాఖ బాధితులకు గొప్ప వరం.. రూ. 120 కోట్ల అదనపు...

LG Chem Company: విశాఖ బాధితులకు గొప్ప వరం.. రూ. 120 కోట్ల అదనపు సాయం

LG Chem Company: అమరావతి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు, ప్రభావిత గ్రామాలకు శుభవార్త. ఎల్జి పాలిమర్స్ మాతృ సంస్థ ఎల్జీ కెమ్ అదనంగా 120 కోట్ల రూపాయలు బాధితులకు అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ అదనపు సాయంతో పాటు బాధితులకు నిరంతర వైద్య పరీక్షలకు ప్రత్యేకంగా ఓ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది. 15 రకాల ఆరోగ్య సమస్యలకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామని కూడా ఎల్జీ కెమ్ ప్రతిపాదించింది. సాయంతో పాటు మిగిలిన హామీలు కూడా నెరవేరుస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. తమ ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచారు.

* అదో మానని గాయం..
విశాఖలోని శివారులో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ఉంది. 2020 మే 7 తెల్లవారుజామున ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. మరో 400 మంది క్షతగాత్రులు అయ్యారు. ఇప్పటికీ వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఘటన తర్వాత మృతుల కుటుంబాలకు పరిహారం కింద ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున చెల్లించింది. కోర్టు ఆదేశాలతో ఎల్జీ పాలిమర్స్ సంస్థ సైతం విశాఖ కలెక్టర్ దగ్గర పరిహారం కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసింది. ఇప్పుడు ఈ మొత్తంతో పని లేకుండా అదనంగా సాయం అందించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు వద్ద తాజాగా ప్రతిపాదనలు పెట్టింది.

* 5000 కుటుంబాలపై ప్రభావం..
నాడు జరిగిన ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ పరిసరాల్లో ఐదు వేల కుటుంబాలపై ప్రభావం పడింది. అయితే నాడు వైసిపి సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్న విమర్శ ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి ప్రయత్నించింది. వారందరికీ ఆర్థిక సాయం అందించే మార్గాలపై ఫోకస్ పెట్టింది. ఈ సంస్థ దక్షిణ కొరియాకు చెందినది. దక్షిణ కొరియాకు చెందిన ‘ది కొరియా ఎకనమిక్ డైలీ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బాధితులకు అండగా నిలిచేందుకు సంస్థ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది. అదే సమయంలో సంబంధిత సంస్థ ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం సంప్రదించింది. దీంతో వారుసానుకూలంగా స్పందించారు. నేరుగా వచ్చి సీఎం చంద్రబాబు తో సమావేశం అయ్యారు. బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రతిపాదనలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పలు కేసులు కోర్టులో విచారణ జరుగుతున్నాయి. కోర్టుల్లో వచ్చే తీర్పుతో సంబంధం లేకుండా.. వాటికోసం ఎదురు చూడకుండా ముందుగానే అదనపు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం విశేషం.

* విశాఖ నుంచి శ్రీ సిటీకి తరలింపు..
అయితే ఎల్జీ పాలిమర్స్ కంపెనీని విశాఖ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా శ్రీ సిటీకి తరలించి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. శ్రీ సిటీలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ను ఏడాదికి 50 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. విశాఖలో ఉన్న ప్లాంట్ ను సురక్షితమైన, పర్యావరణహితమైన వ్యాపారాలకు వినియోగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో విశాఖ ఎల్జి పాలిమర్స్ లో పనిచేసిన ఉద్యోగులు ఆసక్తి చూపితే.. విధుల్లోకి తీసుకుంటామని కూడా కంపెనీ ప్రతినిధులు వివరించారు. అదనంగా వచ్చే ఉద్యోగాల్లోనూ విశాఖ ప్రాంతం వారికి ప్రాధాన్యం ఇస్తామని వారు వివరించారు. ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలతో బాధితుల్లో కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కదలిక రావడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version