Homeఆంధ్రప్రదేశ్‌Amaravati: అమరావతికి కొత్త శోభ.. చంద్రబాబు వేసిన పెద్ద స్కెచ్ ఇదే

Amaravati: అమరావతికి కొత్త శోభ.. చంద్రబాబు వేసిన పెద్ద స్కెచ్ ఇదే

Amaravati: అమరావతి : అమరావతికి కొత్త శోభ వచ్చింది. ప్రాథమిక స్థాయిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తిస్థాయిలో జరిపేందుకు సిఆర్డిఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. తాత్కాలిక పనులకు భారీగా నిధులు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 45 రోజుల్లో అమరావతిని పూర్వస్థితిలోకి తేనున్నారు. ఐకానిక్ నిర్మాణాలకు సంబంధించి పునాదుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వాటిపై సమగ్ర నివేదికను సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. దానికి అనుగుణంగా పనులు జరిపించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు రవాణా సౌకర్యం పై కూడా దృష్టి పెట్టింది. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సైతం ఆసక్తి చూపుతోంది. ఈ బడ్జెట్ లోనే ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూ సేకరణ నుంచి రోడ్డు నిర్మాణం వరకు అన్ని రకాల వ్యయాలను కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.అదే సమయంలో వివిధ ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు జరపాలని స్వయంగా సిఆర్డిఏ అధికారులు కోరుతుండడం విశేషం.

* 131 సంస్థలకు కేటాయింపులు..
టిడిపి ప్రభుత్వ హయాంలో చాలా ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులు కూడా జరిగాయి. దాదాపు 131 ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయించారు.సంస్థలు ఏర్పాటయితే ప్రత్యక్షంగా,పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.అయితే అప్పట్లో టిడిపి హయాంలో 8 సంస్థలు నిర్మాణాలు కూడా ప్రారంభించాయి. ఎస్ఆర్ఎం ,విట్, ఎన్ఐడి, అమృత వంటి విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. కానీ తాగునీరు, రహదారి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటన్నింటిపై తాజాగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

* వీటికి భూముల కేటాయింపు..
ప్రైవేటు సంస్థలకు సంబంధించి విశ్వవిద్యాలయాలు 3, పాఠశాలలు 11, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సంస్థలు నాలుగు, క్రీడలకు సంబంధించిన రెండు, స్టార్ హోటళ్లు 15, వినోదానికి సంబంధించి ఐదు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఐదు, ఇతర సంస్థలు 14 ఉన్నాయి. మొత్తం 59 సంస్థలకు భూములు కేటాయించారు. 23 సంస్థలతో ఒప్పందాలు కూడా అప్పట్లో పూర్తి చేసుకున్నారు. కానీ కేవలం మూడు సంస్థలే నిర్మాణ పనులు ప్రారంభించాయి. ప్రస్తుతం సీఆర్డీఏ అధికారులు ఆయా సంస్థలతో సంప్రదింపులు సాగిస్తున్నారు. గడువు తీరిన ఒప్పందాలను పొడిగిస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ బిజినెస్ స్కూల్ ఎక్స్ఎల్ఆర్ఐ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

* ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు..
వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు సైతం భూములు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 24 సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 23 సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 18, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నాలుగింటికి భూములు కేటాయించారు. మొత్తం 69 సంస్థలకు భూములు కేటాయించగా.. 12 సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. కానీ ఐదు సంస్థలు మాత్రమే అప్పట్లో నిర్మాణ పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటన్నింటికీ లైన్ క్లియర్ చేస్తూ నిర్మాణాలు ప్రారంభించాలని సిఆర్డిఏ అధికారులు నేరుగా ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి వీటి నిర్మాణాలు ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ జగన్ ప్రభుత్వ వైఖరితో అమరావతి నిర్వీర్యం అయ్యింది. సంస్థల ఏర్పాటుకు కల్పించాల్సిన కనీస వసతులపై దృష్టి సారించలేదు. 2019, 24 మధ్య జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఒక్క సంస్థకు కూడా భూమి కేటాయించే పరిస్థితి లేదు. ఆ ప్రభావంతో అమరావతి లోని భూములు నిరుపయోగంగా మారాయి. ఇప్పుడు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి.. సంస్థలను ఆహ్వానిస్తుండడంతో పూర్వ వైభవం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version