https://oktelugu.com/

Viral Video : ఏడుకొండలవాడా.. ఇంతటి కష్టం పగవాడికి కూడా రావద్దయ్యా.. ఈమె మరణానికి కారణం ఎవరయ్యా? : వీడియో వైరల్

వైకుంఠ దర్శనం కోసం వస్తే.. వైకుంఠానికి పంపించేశారు. స్వామివారి సేవలో తరించాలని అనుకుంటే.. గేట్లు ఒక్కసారిగా తీసి తొక్కిసలాటకు కారణమయ్యారు. భక్తులను అంతసేపటి దాకా ఎదురుచూయించి.. చివరికి గేట్లు ఎత్తడంతో తిరుమల లో గతంలో ఎన్నడూ లేనివిధంగా దారుణం చోటుచేసుకుంది. ఆరుగురి భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 9, 2025 / 04:49 PM IST

    Tirumala Stampede Incident

    Follow us on

    Viral Video :  చనిపోయిన ఆరుగురిలో ఒక్కొక్కరిది ఒక్కో గాధ. ఇందులో లావణ్య అనే మహిళ ఉదంతం కంటనీరు తెప్పిస్తోంది. ఆమె చనిపోయిన తీరు ఆవేదనకు గురిచేస్తోంది. లావణ్య వైకుంఠ ద్వారంలో స్వామివారిని దర్శించుకోవడం కోసం తిరుమల వచ్చింది. ఈ క్రమంలో టికెట్లు జారీ చేసే కేంద్రం వద్ద బుధవారం గంటల తరబడి ఎదురుచూసింది. చివరికి గేట్లు ఎత్తడంతో పక్కనున్న భక్తులు పరుగులు పెట్టారు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడింది. తొక్కి సలాట జరగడంతో ఆమె ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయింది. లావణ్యది మంచి మనస్తత్వం. ఇతరులకు సేవ చేయాలనుకునే గుణం ఆమెకు ఉంటుంది. అందువల్లే తన పిన్ని క్యాన్సర్ బారిన పడినప్పుడు.. తన వద్ద ఉంచుకున్నది. ఆసుపత్రిలో చికిత చేయిస్తూ.. ఎప్పటికప్పుడు మందులు వేస్తూ.. ఆమె ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంది.. అయితే లావణ్య చనిపోయిన విషయం ఆమె పిన్నికి తెలియడంతో దిక్కులు పిక్కటిల్లే విధంగా రోదిస్తోంది. ఆమె విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. లావణ్య కు ఇద్దరు కుమార్తెలు. వారు ప్రస్తుతం పై ఇంటర్, హై స్కూల్ చదువులు చదువుతున్నారు. తల్లి చనిపోయిన విషయం తెలియడంతో వారి ఆవేదనకు అంతేలేకుండా పోయింది.

    కన్నీటి పర్యంతం

    లావణ్య చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె పిన్ని దిగ్భ్రాంతికి గురైంది. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఫోన్లో ఆమె బంధువులు చెప్పిన ప్రతి విషయం గుండెను చెరువు చేసింది. దీంతో ఆమె లావణ్య మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ విలపించింది. ” నాకు క్యాన్సర్ సోకింది. ఆ సమయంలో లావణ్య నాకు మరో తల్లి అయింది. అన్నీ తనే చూసుకుంది. ఇవాళ అందరినీ వదిలేసి వెళ్లిపోయింది. నా తల్లి నాకుకాకుండా పోయింది. దేవుడా ఎందుకయ్యా ఇంత కష్టం.. ఇంత బాధ మాకెందుకయ్యా.. వైకుంఠ ద్వారంలో నిన్ను దర్శించుకోవడానికి వస్తే మాకెందుకయ్యా ఇంత శాపం.. ఏం పాపం చేసింది నా బిడ్డ.. ఇంత దారుణం మరెక్కడైనా ఉంటుందా.. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి లేని లోటు ఎవరు తీర్చుతారు. వారి ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారు.. ఇంతటి విషమ పరీక్ష నా బిడ్డకు ఎందుకు పెట్టావయ్యా” అంటూ లావణ్య పిన్ని విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. నిన్న గేట్లు తెరిచిన వెంటనే లావణ్య ను దాటి ఇతర భక్తులు పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే తొక్కిసలాట(stampede) జరిగింది. అందువల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లావణ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత.. ఆమె భౌతికకాయాన్ని స్వస్థలానికి టిటిడి అధికారులు పంపించారు. శుక్రవారం సాయంత్రం లావణ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో వైపు ఈ ఘటనలో చనిపోయిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం(tirumala Tirupati devasthanam) 25 లక్షల ఎక్స్ గ్రేషియా(ex gratia) ప్రకటించింది.