Lakshmi Parvathi: ఏదైనా మంచి పని చేస్తే అభినందించాలి. లేకుంటే మౌనంగా ఊరుకోవాలి. కానీ కొంతమంది అలా కాదు. తనకు దక్కనిది.. తనను గౌరవించనిది.. మరొకరికి దక్కకూడదు అన్నది వారి బాధ. ఇప్పుడు నందమూరి లక్ష్మీపార్వతి ది కూడా అదే బాధ. మొన్న వైయస్ విజయమ్మ పుట్టినరోజు. ఆరోజు వైయస్ జగన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ.. లోకేష్ చెప్పడంతో హైలెట్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు సైతం ఆహ్వానించారు ఈ పరిణామాన్ని. అయితే దానికి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా లక్ష్మీపార్వతిని రంగంలోకి దించినట్లు ఉన్నారు.
* విజయమ్మకు శుభాకాంక్షలు చెబితే..
సాధారణంగా లోకేష్( Nara Lokesh) విషయంలో లక్ష్మీపార్వతి ఏ స్థాయిలో మాట్లాడుతుంటారో ఇట్టే తెలిసిపోతుంది. ఎప్పుడైతే విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి.. సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు లక్ష్మీపార్వతి సీన్లోకి వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాను స్వయంగా లక్ష్మీపార్వతి దగ్గరకు తీసుకుపోయి ఇంటర్వ్యూ లతోపాటు లైవ్ లు ఇప్పించారు. నారా లోకేష్ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం తప్పు అని తేల్చి చెప్పారు లక్ష్మీపార్వతి. రాజకీయం కోసమే అలా చేశారని తన వాదనలు వినిపించారు.
* దానిని కూడా తప్పుపట్టాలా?
సాధారణంగా రాజకీయ ప్రత్యర్థి కుటుంబాలు అయినా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. పైగా రాజశేఖర్ రెడ్డి తో చంద్రబాబుకు మంచి స్నేహం ఉంది. వారిద్దరూ రాజకీయంగా విభేదించుకుంటారే తప్ప వ్యక్తిగతంగా అభిమానించుకుంటారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి భార్యకు లోకేష్ శుభాకాంక్షలు చెప్పడం తప్పు ఎలా అవుతుంది. అయితే పనిలో పనిగా లక్ష్మీపార్వతి కూడా తన కడుపు మంటను బయటపెట్టేసారు. అమ్మమ్మ అయిన తననే ఎప్పుడు లోకేష్ శుభాకాంక్షలు తెలపలేదని.. అటువంటిది విజయమ్మకు చెప్పడం ఏమిటనే రీతిలో ఆమె మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె డిమాండ్ చేసిన తీరు మాత్రం నవ్వుల పాలు అవుతోంది. ఆమెను నందమూరి తో పాటు నారా కుటుంబాలు కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు. అందుకే ఆమె తన రాజకీయ మార్గాన్ని వేరే రూట్లో ఎంచుకుంది. జగన్మోహన్ రెడ్డి వద్ద పెద్దదిక్కుగా చేరారు. అయితే ఆమె రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ పెద్దరికం మాటలు చెప్పాలి. విజయమ్మకు లోకేష్ శుభాకాంక్షలు చెబితే అభినందించాల్సింది పోయి.. తిరిగి ఆమె లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. అయితే దీని వెనుక ఎవరు ఉంటారో అందరికీ తెలిసిందే. ఎందుకంటే లోకేష్ ను జాకీలు పట్టి లేపుతున్నారు అంటూ జగన్ ఆరోపిస్తూ వచ్చారు. తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పినా.. ఆయనకు ఇప్పుడు జాకీలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కనీసం లక్ష్మీపార్వతి తన వయసుకు తగ్గట్టు వ్యవహరించవచ్చు కదా? లేనిపోని వివాదాల్లో తల దూర్చడం ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.