Mudragada Health: ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభానిది ప్రత్యేక స్థానం. ఆయన రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే సుపరిచితులు. అయితే ఆయన చేసిన ఉద్యమం పూర్తి జగన్ మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. 2019లో కాపులు జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ కావడానికి ప్రధాన కారకులు ముద్రగడ. అంత అండగా నిలిచిన ముద్రగడ.. ప్రస్తుతం అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆయన వైద్యానికి ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతటి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అండ ఆయనకు లేకుండా పోయిందన్న ఆవేదన ఆయన అనుచరుల్లో వినిపిస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముద్రగడ. మళ్లీ ఇప్పుడు అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య ఖర్చులు ఊహించని స్థాయిలో ఉండడంతో.. బిల్లులు భరించలేక రాత్రికి రాత్రి ఆయనకు సమీపంలోని ఓ చిన్న ఆసుపత్రిలో చేర్చడం హాట్ టాపిక్ అవుతోంది.
* కాపు రిజర్వేషన్ ఉద్యమం..
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ తో.. టిడిపి సర్కార్ పై పెద్ద ఉద్యమమే చేశారు ముద్రగడ. నిజంగా కాపులకు న్యాయం జరగాలని ఆయన చేసి ఉంటారు. కానీ అది కాపులకు కంటే జగన్మోహన్ రెడ్డికి మేలు చేసింది. కానీ ముద్రగడను కేవలం అవసరాల కోసమే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. 2024 ఎన్నికల్లో కుమారుడితో పాటు పార్టీలో చేరిన వారికి కనీసం టికెట్లు కేటాయించలేదు. ఇప్పుడు ఆయన వైద్యానికి కనీస భరోసా ఇవ్వకపోవడం పై ముద్రగడ అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు వస్త్రంగా మారారు ముద్రగడ. ఆయనకు ఇష్టం లేకపోయినా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీ పంచన చేరారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకునే బాధ్యతను ఆయనకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చివరకు ఆయన అనారోగ్యంతో ఉన్న బలవంతంగా వీడియో బైట్స్ విడుదల చేయించడం వెనుక.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. తాజాగా సాయి కృష్ణ ఉదంతం లో ముద్రగడ పేరుతో ఒక లేఖ బయటకు రావాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
* భారీగా వైద్య ఖర్చులు..
హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భారీగా ఉన్నాయి. దీంతో మరో ఆసుపత్రికి మార్చక తప్పలేదు. ఈ విషయంలో సాయం పొందేందుకు ఆయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కానీ ఎటువంటి సాయం అందించేందుకు అటు నుంచి సుముఖత రాలేదని ప్రచారం సాగుతోంది. ఆర్థిక భరోసా రాకపోవడంపై ముద్రగడ అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో పార్టీ ముద్రగడను ఒంటరి చేయడం తగదు అని గోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు, కాపు సామాజిక వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఎగదోసి.. చలి మంటలు కాచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ముద్రగడకు బదులు.. కాపు సామాజిక వర్గం నేతలను ఏకతాటి పైకి తీసుకొచ్చే బాధ్యతను తోట త్రిమూర్తులకు జగన్ అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఇప్పుడు ముద్రగడ అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఆయన అవసరం ఉండదు అని నిర్ధారణకు వచ్చి పక్కన పెట్టేసినట్టు అర్థం అవుతోంది.
