Pawan Kalyan Home Minister: నేనే హోం మంత్రి అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇటీవల తరచూ వస్తున్న మాట ఇది. గతంలో ఓ ఘటన విషయంలో సీరియస్ గా స్పందించారు పవన్ కళ్యాణ్. హోం మంత్రి వంగలపూడి అనితకు కీలక సూచనలు చేశారు. మీరు పట్టించుకోకపోతే హోం శాఖ పరిధిలో కూడా పని చేయాల్సి ఉంటుందని పరోక్ష సంకేతాలు పంపారు. ఇప్పుడు తాజాగా జన సైనికులతో నిర్వహించిన సమావేశంలో సైతం అలానే మాట్లాడారు. అయితే ఆవేదనతో మాట్లాడారు. ఏపీలో కుల భావన పెరిగిపోయిందని.. రాజకీయాల కోసం కులాల ప్రస్తావన తీసుకొచ్చి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని.. నేరాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని.. అప్పుడే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.. నేను హోమ్ మినిస్టర్ కాదని.. అదే క్రిమినల్స్ అందరి అదృష్టం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
* మంత్రివర్గ విస్తరణలో..
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ హోం మంత్రి తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రిత్వ శాఖను తీసుకుంటారని అంతా అనుకున్నారు. ఎందుకంటే అన్ని శాఖల పరిధిలో ఉంటుంది హోం శాఖ. ముఖ్యమంత్రి తర్వాత అంత అధికార పరిధి ఉంటుంది. అందుకే ఎక్కువమంది సీనియర్లు ముఖ్యమంత్రి తర్వాత స్థానంగా భావించే హోం మంత్రిత్వ శాఖను ఆశిస్తారు. ఏపీలో మూడు పార్టీల కూటమి, ఆపై సీట్ల సర్దుబాటు తో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత సమన్వయం విషయంలో పవన్ కళ్యాణ్ చాలా పరిణీతితో వ్యవహరించారు. అందుకే ఆయన హోమ్ మంత్రిత్వ శాఖను తీసుకుంటారని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏరి కోరి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను తీసుకున్నారు. ఆ శాఖలో తనదైన ముద్ర చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగింది అనేది ఒక బలమైన ముద్ర ఉంది.
* ఆ శాఖలంటేనే ఇష్టం..
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోం శాఖను తీసుకుంటారా? అనేది ఒక చర్చ. అయితే పవన్ ఆ మంత్రిత్వ శాఖను తీసుకుంటే మాత్రం చాలా దూకుడుగా ఉంటారు. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తుల పట్ల, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. కానీ కొన్ని రకాల సమస్యలు తప్పకుండా ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే రాజకీయ ప్రేరేపిత ఘటనలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. కానీ పవన్ మాత్రం హోం మంత్రిత్వ శాఖను తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి, గిరిజనాభివృద్ధి బాధ్యతలను తీసుకున్నారు పవన్. హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు కానీ సీఎం చంద్రబాబు నిత్య పర్యవేక్షణ ఉంటుంది హోం శాఖ విషయంలో. అందుకే పవన్ హోంమినిస్టర్ పదవి తీసుకునే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
