Konathala Ramakrishna: ఏపీలో( Andhra Pradesh) కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 12న సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా 24 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఒక మంత్రి పదవిని క్యాబినెట్లో ఖాళీగా ఉంచారు. అయితే దానిని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రాజ్యసభ పదవుల విషయంలో నాగబాబుకు సర్దుబాటు చేయలేకపోవడం వల్ల.. ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టు నాగబాబును ఎమ్మెల్సీ చేశారు. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్న కార్యరూపం దాల్చలేదు. ఈ తరుణంలో కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. జూలై చివరి వారంలో స్వల్ప మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ద్వారా నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభం అయింది.
Also Read: Pawan Kalyan Report Card : పవన్ కళ్యాణ్ పాలన రిపోర్ట్ కార్డు ఎలా ఉంది?
* కేంద్ర రాజకీయాల వైపు మొగ్గు
వాస్తవానికి నాగబాబుకు( Nagababu ) కేంద్ర రాజకీయాలు అంటే ఆసక్తి. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ సీటు పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. సీఎం రమేష్ పోటీ చేశారు. అలా నాగబాబుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు రాజ్యసభ సభ్యుల భర్తీ సమయంలో కూడా చివరి నిమిషం వరకు నాగబాబు పేరు వినిపించింది. కానీ రాజకీయ సమీకరణల దృష్ట్యా అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలోనే సీఎం చంద్రబాబు ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అటు తరువాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని పవన్ భావించారు. సొంత కుటుంబ సభ్యులతో పాటు కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అందుకే నాగబాబు విషయంలో అంత తొందరపాటు పడలేదని తెలుస్తోంది. రాజకీయంగా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని పవన్ భావిస్తున్నారు.
* ఆషాడ మాసం తర్వాత..
అయితే ఇప్పుడు కొత్త ఆలోచనతో నాగబాబుకు మంత్రి పదవి క్లియర్ అయినట్లు ప్రచారం సాగుతోంది. ఆషాడ మాసం తర్వాత మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఉండేలా నిర్ణయించారు. జూలై చివరి వారంలో నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం జనసేనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు కందుల దుర్గేష్( kandula Durgesh ) కాపు సామాజిక వర్గానికి చెందినవారు. నాదేండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ముగ్గురు కూడా ఓసీలే. అందుకే బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ ను మంత్రివర్గం నుంచి తప్పించి అదే స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణను క్యాబినెట్లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ ను తప్పిస్తే ఆ సామాజిక వర్గానికి ఎలాంటి సంకేతం వెళ్తుందోనన్న ఆందోళన కూడా ఉంది. అందుకే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
Also Read: రెడ్ జోన్ లో ఆ 50 మంది.. సంచలన సర్వే!