Kolikapudi Srinivasa Rao: ఏపీలో విజయవాడ( Vijayawada) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేశినేని కుటుంబంలో జరుగుతున్న వివాదం కాక రేపుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న కేశినేని నానిని సైడ్ చేసి.. ఆయన సోదరుడు చిన్ని తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తన సోదరుడు నాని పై పోటీ చేసి గెలిచారు. అయితే తనను ఉన్నఫలంగా టిడిపి నుంచి దూరం చేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టిన సోదరుడు చిన్నిపై విరుచుకుపడుతున్నారు నాని. ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇటీవల సోదరుడు, ఎంపీ చిన్ని పై విరుచుకుపడుతున్నారు. అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒక విధంగా చిన్నిని టార్గెట్ చేస్తూ టిడిపి హై కమాండ్ ను ఇరుకున పెడుతున్నారు. అయితే సోదరులు ఇద్దరి మధ్య జరుగుతున్న విభాగంలో మధ్యకు వచ్చేందుకు ఏ నేత ఇష్టపడడం లేదు. కానీ ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
Also Read: వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. అయినా సరే జైల్లోనే! కారణమదే
* నాటి నుంచి వివాదం.. విశాఖలో( Visakhapatnam) ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉర్సా క్లస్టర్ అనే ఐటీ సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు విశాఖలో పెద్ద ఎత్తున భూములు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ కేసినేని నాని తెరపైకి వచ్చారు. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఉర్సా సంస్థకు అంత కెపాసిటీ లేదని.. అది బోగస్ అని.. దాని వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఏపీ మద్యం కుంభకోణంలో ఉన్న నిందితులతో ఎంపీ చిన్నికి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాజ్ కసిరెడ్డి తో ఎంపీ చిన్నికి వ్యాపార లావాదేవీలు నడిచాయని కూడా ఆరోపించారు. ఈ క్రమంలో టిడిపి హై కమాండ్ పునరాలోచనలో పడింది. అయితే ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఏ టిడిపి నేత ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముందుకు రావడం విశేషం.
* టికెట్ రావడానికి చిన్ని కారణం..
వాస్తవానికి కొలికపూడి శ్రీనివాసరావుకు( Koli ka Pudi Srinivas Rao) టికెట్ రావడానికి కారణం కేసినేని చిన్ని అని అప్పట్లో ప్రచారం నడిచింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తిరువూరు నియోజకవర్గంలో అనేక వివాదాలు నడిచాయి. ఆ సమయంలో సైతం కొలికపూడికి ఎంపీ చిన్ని అండగా నిలిచారు. అందుకే ఇప్పుడు ఎంపీ చిన్ని కోసం కొలికపూడి శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. మాజీ ఎంపీ కేశినేని నాని ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ సిబిఐకి లేఖ రాశారు. ఆర్థిక నేరాలకు పాల్పడడం, రుణాలు ఎగ్గొట్టడంలో కేశినేని నాని ఘనపాటి అని కొలికపూడి ఆరోపించారు. వైసీపీ జెండాతో నాని అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎంపి కేసినేని శివనాథ్ పై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. షెల్ కంపెనీలతో నాని ఆదాయాన్ని మళ్ళిస్తున్నట్లు ఆయన తెలిపారు. మద్యం కుంభకోణం పై జరుగుతున్న విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత పది సంవత్సరాలుగా ఎంపీ పదవిని ఆయన దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత పదేళ్ల కాలంలో విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది.. కూటమి 11 నెలల కాలంలో ఎలా అభివృద్ధి జరిగింది అన్నదానిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
* బుద్ధ వెంకన్న తర్వాత ఈయన..
ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పరంగా ఈ వివాదంలో మాట్లాడింది మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఆయన కేశినేని నానికి వ్యతిరేకి. వెంకన్న లాంటి వారి మూలంగానే నాని టిడిపికి దూరమయ్యారన్న విమర్శ ఉంది. అయితే ఇప్పుడు ఈ వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఆలోచించదగ్గ విషయం. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కూడా ఉంది.కొలికపూడి మరింత దూకుడుగా విమర్శలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే రచ్చ రంబోలా ఖాయం.