Kolikapudi Srinivasa Rao: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapudi Srinivasa Rao) మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ముఖ్యంగా చాలా రకాల వివాదాల్లో చిక్కుకున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చుకునే పరిస్థితి దాకా తెచ్చుకున్నారు. అయితే ఈసారి పార్టీ కోసం రంగంలోకి దిగారు. తిరువూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురువేయాలని భావించారు. ఈరోజు ఎన్నిక జరగనుండడంతో.. నగర పంచాయతీ చైర్మన్ పోస్ట్ టిడిపికి దక్కేలా పావులు కదుపుతున్నారు. దీనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురు కావడంతో తిరువూరు ఉద్రిక్తంగా మారింది. అయితే ఎమ్మెల్యే శ్రీనివాసరావు దూకుడుతో నగర పంచాయతీ పీఠం టిడిపికి దక్కే అవకాశం కనిపిస్తోంది.
Also Read: వైసీపీలో నేతల నోర్లు తెరుస్తున్నాయే!
* నగర పంచాయతీకి ఉప ఎన్నిక..
2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) తిరువూరు నగర పంచాయతీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 20 వార్డులకు గాను 17 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను పొందింది. అయితే ఎన్నికల సమయంలో కొంతమంది.. ఫలితాలు వచ్చిన తర్వాత మరికొంతమంది టీడీపీలో చేరారు. ఈ క్రమంలో ఈనెల మూడున వైసీపీకి చెందిన చైర్ పర్సన్ కస్తూరిబాయ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈరోజు ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే తిరువూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పార్టీ కౌన్సిలర్లను బలవంతంగా లాక్కున్నారని ఎమ్మెల్యే కొలికపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టిడిపి కండువా కప్పుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు సైతం ఓటు ఉండడంతో ఆయన మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే తమ పార్టీకి చెందిన సభ్యులను బలవంతంగా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కొలికపూడి టిడిపి సభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారితో కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
* గత కొద్దిరోజులుగా వివాదాలు..
ఎన్నికల ఫలితాల( election results ) తర్వాత సొంత పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. దీంతో చాలా రకాలుగా పంచాయితీలు నడిచాయి. చివరకు హై కమాండ్ పెద్దలు రంగంలోకి దిగి.. కీలక సూచనలు చేయడంతో సైలెంట్ అయ్యారు. టిడిపికి చెందిన ఓ నేతను బహిష్కరించకపోతే తన ప్రతాపం చూపుతానని హెచ్చరించారు ఆమధ్య. హై కమాండ్ గట్టిగా మందలించడంతో సైలెంట్ అయిపోయారు. ఇటీవల కేసినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న వివాదంలో సైతం ఎంటర్ అయ్యారు. అయితే ఇప్పుడు తిరువూరు నగర పంచాయతీలో టిడిపి జెండా ఎగురవేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే దూకుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.