Kodela Shivaram :  మూడేళ్లుగా పట్టించుకోని బాబు.. టీడీపీకి కోడెల తనయుడి గుడ్ బై

మూడేళ్లుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటే చంద్రబాబు కూడా కఠిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అమీతుమీ తేల్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని కోడెల వర్గీయులు చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : June 3, 2023 4:36 pm
Follow us on

Kodela Shivaram :  వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు వెంటాడి వేటాడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు అదే వైసీపీలోకి కోడెల తనయుడు శివరామ్ లో చేరతారని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో మనస్తాపానికి గురైన శివరాం పార్టీలో తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. పార్టీ మారడం అనివార్యమన్న రీతిలో సంకేతాలిస్తున్నారు.

2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాదరావు పోటీచేసి గెలుపొందారు. మంత్రి పదవి ఆశించారు. కానీ చంద్రబాబు ఆయన్ను అనూహ్యంగా స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. అయిష్టంగానే ఆ కుర్చీలో కూర్చొన్న కోడెల వైసీపీ వాళ్లకు టార్గెట్ అయ్యారు. కొన్ని నిర్ణయాలు వైసీపీకి వ్యతిరేకంగా తీసుకోవడంతో వారు స్పీకర్ తీరును తప్పుపట్టారు. దీనికితోడు కోడెల తనయుడు శివరాం ఆధిపత్యం ఎక్కువైంది. ఆయనపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఓటమి ఎదురైందన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే కోడెల మృతి తరువాత కుమారుడు శివరాంకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదని ప్రచారం జరిగింది.

ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చంద్రబాబు సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇది టీడీపీలో రచ్చకు కారణమవుతోంది. కోడెల శివ‌రాం గ‌త కొంత‌కాలంగా త‌న‌కు జ‌రుగుతున్న అవ‌మానాల్ని చెప్పుకొచ్చారు.  మ‌హానాడులో క‌నీసం త‌న తండ్రికి నివాళి కూడా అర్పించ‌లేద‌ని భావోద్వేగానికి గుర‌య్యారు. టీడీపీ కోసం త‌న కుటుంబం త్యాగం చేసింద‌ని ఆయ‌న అన్నారు. గుంటూరు జిల్లాలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో త‌న తండ్రి కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు రాజ‌కీయ పోరాటం చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. గ‌తంలో కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన క‌న్నా…. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంతో మంది టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు పెట్టి వేధించార‌ని వాపోయారు.కేవ‌లం టికెట్ కోసం రోజుకొక పార్టీ మారే క‌న్నాను స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. త‌మ గోడును వెళ్ల‌బోసుకునేందుకు మూడేళ్లుగా ఐదునిమిషాలు అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరుతున్నా ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్‌, టికెట్ విష‌యాల్ని ప‌క్క‌న పెడితే, క‌నీసం త‌మ మాట విన‌డానికి కూడా చంద్ర‌బాబు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం ఏంట‌ని ఆయ‌న నిలదీశారు. శివరాం తాజా దూకుడు చూస్తుంటే ఆయన వైసీపీలో చేరికకు మార్గం సుగమం చేసుకుంటున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మూడేళ్లుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటే చంద్రబాబు కూడా కఠిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అమీతుమీ తేల్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని కోడెల వర్గీయులు చెబుతున్నారు.