https://oktelugu.com/

Keshineni Nani – Galla Jayadev : చంద్రబాబుకు ఝలక్.. వైసీపీలోకి కేశినేని నాని, గల్లా జయదేవ్

అయితే ఉన్నట్టుండి జయదేవ్ సైతం సైలెంట్ అయ్యారు. ఆయన సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికైతే టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు బయటకు వెళ్లాలనుకోవడం చంద్రబాబుకు ఝలకే. 

Written By:
  • Dharma
  • , Updated On : June 3, 2023 / 04:24 PM IST
    Follow us on

    Keshineni Nani – Galla Jayadev : ఏపీలో కీలక రాజకీయ పరిణామం. టీడీపీకి కలవరపాటుకు గురిచేసే వార్త ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో.. ఇద్దరు వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. గత కొద్దిరోజులుగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్న ఇద్దరు ఎంపీలను వైసీపీ గాలం చేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకుగాను టీడీపీ మూడు స్థానాలనే దక్కించుకుంది. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ లు టీడీపీ తరుపున గెలుపొందారు. అయితే ఇప్పుడు అందులో ఇద్దరు వైసీపీలోకి జంప్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లుగా వైసీపీ నుంచి ఇబ్బందులు తట్టుకున్నా.. టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో కేశినేని నాని, గల్ల జయదేవ్ లు వైసీపీలో చేరనున్నట్టు టాక్ నడుస్తోంది.

    2014 ఎన్నికల్లో కేశినేని నాని, గల్లా జయదేవ్ లు తొలిసారిగా ఎంపీలుగా పోటీచేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు. అటు చంద్రబాబు సైతం ఎంపీలకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. అయితే ఉన్నట్టుండి పార్టీలో నెలకొన్న పరిణామాలతో ఇద్దరు ఎంపీలు దూరమవుతూ వచ్చారు. కానీ చంద్రబాబు దగ్గర చేర్చేందుకు ప్రయత్నాలు అంతగా చేయకపోవడం, ఆపై వీరి వ్యతిరేకులకు అగ్రతాంబూలం ఇవ్వడంతో వీరికి రుచించలేదు. అందుకే పార్టీ మారేందుకు మొగ్గుచూపిస్తున్నట్టు సమాచారం.

    ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని వైఖరి కాస్తా భిన్నంగా ఉంది. అధినేతతో పాటు కృష్ణా జిల్లా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆయన మనసు వైసీపీపై మళ్లిందన్న ప్రచారం జరిగింది. ఈ విషయంలో  వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం స్పందించారు. కేశినేని నాని వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. కేశినేని నానికి   చంద్రబాబుతో మునపటిలా సంబంధాలు తగ్గిపోయాయి. అటు నాని వ్యతిరేక శిబిరంలోని బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా నుంచి కూడా ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. వారితో పొసగడం లేదు. ఆ రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. కేశినేని నాని వ్యవహార శైలిపై చంద్రబాబుకు ఫిర్యాదులు వస్తున్నాయి.
    ఇటీవల చంద్రబాబు నాని తమ్ముడు  చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. నాని వ్యవహార శైలితో చికాకు పెడుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా చంద్రబాబు జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. సహజంగా ఇది నానికి మింగుడుపడడం లేదు.  అందుకే వైసీపీలోకి వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నట్టు సమాచారం.

    నిత్యం అధినేత వద్ద కనిపించే గల్లా జయదేవ్ ఇటీవల ఎక్కడా బయట కనిపించడం లేదు. అటు పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని ముందుండి నడపడంలో జయదేవ్ కీలక పాత్ర పోషించారు. లోక్ సభలో సైతం ప్రధానినే నేరుగా ప్రశ్నించారు. అటు వైసీపీ సర్కారుకు టార్గెట్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీపై వైసీపీ సర్కారు దాడులు, తనిఖీల పేరిట చికాకు పెడుతుండడంతో.. తమ పరిశ్రమ విస్తరణకు తెలంగాణను ఎంచుకున్నారు. అయితే ఉన్నట్టుండి జయదేవ్ సైతం సైలెంట్ అయ్యారు. ఆయన సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికైతే టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు బయటకు వెళ్లాలనుకోవడం చంద్రబాబుకు ఝలకే.