Kodali Nani : వైసీపీ ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. ప్రత్యర్థులపై ఒక పద్ధతి ప్రకారం ఆయన విరుచుకుపడతారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు.అయితే ఇవి వైసీపీ శ్రేణులకు ముద్దుగా అనిపిస్తాయి. కానీ ఇతరులకు మాత్రం మానని గాయంగా మారుతున్నాయి. అందుకే విపక్షాలు అతడ్ని బూతుల నేతగానే పరిగణిస్తాయి. అయితే ఆయన బాధిత పార్టీలుగా ఇప్పటివరకూ టీడీపీ, జనసేన ఉండేవి. ఇప్పుడు ఆ జాబితాలో బీజేపీ వచ్చి చేరింది. మారిన రాజకీయ పరిస్థితులో.. లేక బీజేపీ ఆ రెండు పార్టీల నీడలోకి చేరుతుందోనన్న అనుమానమో తెలియదు కానీ .. కొడాలి నాని ఇప్పుడు బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు.
ఇటీవల బీజేపీ గుడివాడ నియోజకవర్గంలో ఒక సమావేశం నిర్వహించింది. కార్యక్రమానికి బీజేపీ ఏపీ ఇన్ చార్జి సునీల్ దియోధర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కొడాలి నానిపై విమర్శలు చేశారు. ఆయన ప్రవర్తన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొడాలి నాని లాంటి వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వారిని జైలుకు పంపుతామని ఘటూ వ్యాఖ్యలు చేశారు. ఇవి బాగానే వైరల్ అయ్యాయి. కొడాలి నాని ప్రత్యర్థులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు.
అయితే బీజేపీ నేత, ఇపై ఇన్ చార్జి కదా అని సునీల్ దియోధర్ విషయంలో కొడాలి నాని కాస్తా తగ్గుతారని అంతా భావించారు. కానీ తనకు అలవాటైన ఘాటు వ్యాఖ్యలతో నాని రెచ్చిపోయారు. స్ట్రాంగ్ గానే రియాక్డకయ్యారు. సునిల్ దియోధర్ పకోడీ లాండి వారని.. ఇలాంటి పకోడీ గాళ్ల వల్లే బీజేపీ కర్ణాటకలో ఓడిపోయిందని… అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నిస్తుంటే మధ్యలో ఈ పకోడీ గాడెవడు అంటూ కామెంట్స్ చేశారు. ఇలాంటి దరిద్రులను పెట్టుకుంటే బీజేపీ నశనం అవుతుందని ఫైర్ అయ్యారు.
దీనిపై బీజేపీ నేతల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న స్లోగన్ ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని.. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని లాంటి వారు ప్రత్యర్థులపై విరుచుకుపడిన సమయంలో పెద్దన్న పాత్రలో ఉన్న బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ఖండించిన దాఖలాలు లేవు. ఇప్పుడు తన వరకు వస్తే కానీ ఆ విషయం తెలియలేదు. అయితే మున్ముందు కొడాలి నాని లాంటి నేతలు బీజేపీని మరింతగా టార్గెట్ చేసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.