https://oktelugu.com/

Kiran Kumar Reddy: పెద్దిరెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి.. ఓ కాళ్లు పట్టుకున్న కథ

చిత్తూరులో నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్యం ఈనాటిది కాదు. వారి మధ్య దశాబ్దాల వైరం నడుస్తోంది. రెండు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న.. కలిసి పనిచేసింది చాలా తక్కువ.

Written By:
  • Dharma
  • , Updated On : April 19, 2024 / 05:58 PM IST

    Kiran Kumar Reddy

    Follow us on

    Kiran Kumar Reddy: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. రాయలసీమ రాజకీయాలని ప్రస్తుతం శాసిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసిపి గెలవడంతో ఆయన ప్రాముఖ్యత పెరిగింది. జగన్ సైతం ఆయన సీనియారిటీని, సిన్సియార్టీని వాడుకుంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓడితే జగన్కు మించి పెద్దిరెడ్డి కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయనను ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి టార్గెట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ ఇద్దరితోనూ పెద్దిరెడ్డికి వైరం నడుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా వారిద్దరిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతలా పెట్టారు పెద్దిరెడ్డి. అందుకే అధికారానికి పెద్దిరెడ్డి దూరమైన మరుక్షణం.. ఆ ఇద్దరు నేతలు పట్టు బిగించే అవకాశం ఉంది.

    చిత్తూరులో నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్యం ఈనాటిది కాదు. వారి మధ్య దశాబ్దాల వైరం నడుస్తోంది. రెండు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న.. కలిసి పనిచేసింది చాలా తక్కువ. రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలో సైతం ఈ రెండు కుటుంబాలను సమన్వయం చేయలేకపోయారు. మధ్యలో చంద్రబాబు మంత్రి కావడం,తరువాత టిడిపిలోకి వెళ్లి సీఎం కావడం, రాష్ట్రస్థాయిలో కీలక నేతగా ఎదగడం వంటివి జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈ మూడు కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్యం నడిచేది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి గూటికి చేరారు. ఆయన తమ్ముడు గత ఎన్నికలకు ముందే టిడిపిలో చేరారు. ప్రస్తుతం టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండడంతో.. చంద్రబాబుతో చేతులు కలపాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి నేతల ఉమ్మడి శత్రువుగా పెద్దిరెడ్డి నిలిచారు.

    పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ సీటును బిజెపికి కేటాయించారు. బిజెపి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబంతో కిరణ్ ముఖాముఖిగా తలపడాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు సైతం కిరణ్ తో చేతులు కలపడంతో.. పెద్దిరెడ్డికి రాజంపేట లోక్ సభ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఇప్పుడు ముఖాముఖిగా తలపడడంతో.. కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డిల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పెద్దిరెడ్డిని ఉద్దేశించి.. కిరణ్ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు.. చిత్తూరు డిసిసి అధ్యక్ష స్థానం కోసం తన కాళ్లు పట్టుకున్నారు పెద్దిరెడ్డి అంటూ.. కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.