Killi Krupa Rani: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ దిగ్గజం కింజరాపు ఎర్రన్నాయుడు ను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పదవి పొందారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే అరుదైన అవకాశాలను దక్కించుకున్నారు. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో.. కృపారాణి రాజకీయ భవిత డోలయమానంలో పడింది. వైసీపీలో చేరడం ఆలస్యం కావడంతో ఆమెకు అవకాశం లేకుండా పోయింది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆమెకు ఎటువంటి అవకాశాలు దక్కలేదు. రాజకీయ అవమానాలు ఎదురయ్యాయి. దీంతో కృపారాణి ఆ పార్టీని వీడారు.
తొలిసారిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా ఉన్న కింజరాపు ఎర్రంనాయుడుకు గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో 2009లో రెండోసారి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. అనూహ్య విజయం దక్కించుకున్నారు. జాతీయస్థాయిలో సైతం గుర్తింపు సాధించుకున్నారు. దీంతో యూపీఏ 2 ప్రభుత్వంలో కమ్యూనికేషన్ సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో దారుణంగా దెబ్బతింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీని కృపారాణి వీడలేదు. 2014 ఎన్నికల్లో మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
అయితే కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు రావడంతో కృపారాణి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో.. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు జగన్. ఆ ఆశతో వైసీపీలో చేరారు. జిల్లా పార్టీ పగ్గాలు తీసుకున్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల సమయంలో కృపారాణి పేరు బలంగా వినిపించేది. కానీ అదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన అడ్డుకునేవారని ఆరోపణ ఉంది. ఓసారి సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాకు వస్తే కలిసేందుకు వెళ్లిన కృపారాణికి పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. అయితే దీని వెనుక ధర్మాన ప్రసాదరావు హస్తం ఉందని ఆమె బాహటంగానే ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా కృపారాణికి టికెట్ దక్కలేదు. తనకంటే జూనియర్లు ఆయిన దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లకు టిక్కెట్లు లభించాయి. కృపారాణికి మాత్రం మొండి చేయి చూపారు. దీంతో వైసీపీలో ఉండడం శ్రేయస్కరం కాదని ఆమె భావించారు. అందుకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి తాను.. టెక్కలి అసెంబ్లీ సీటు నుంచి తన కుమారుడిని బరిలో దించాలని కృపారాణి భావిస్తున్నారు. ఆ షరతుకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలపడంతోనే ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీని ఓడించడమే ధ్యేయంగా ఆమె పావులు కదుపుతున్నట్లు సమాచారం. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలో కాలింగులు అధికం. అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. టెక్కలి అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇప్పుడు కృపారాణి పోటీ చేయడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ఓట్ల చీలిక జరుగుతుంది. అధికార పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామంగా మారనుంది.