Key Tip Devotees in Tirumala : తిరుమలలో( Lord Tirumala ) భక్తుల రద్దీ కనిపిస్తోంది. వేసవి సెలవులు ముగియనుండడంతో ఆ ప్రభావం స్పష్టంగా ఉంది. ఇక వీకెండ్ లో భక్తుల రద్దీ గురించి చెప్పనవసరం లేదు. మరోవైపు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా.. టిటిడి సత్వర చర్యలు చేపట్టింది. కొన్ని రకాల మార్పులు చేసింది. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వచ్చే భక్తులకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు శ్రీవారి మెట్టులో ఉన్న దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా.. అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ కు తరలించినట్లు టిటిడి స్పష్టం చేసింది. ఈ కొత్త కౌంటర్లు శుక్రవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పుతో శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్ల లభ్యత ఉండనుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* నిండిపోతున్న కాంప్లెక్స్‌లు..
ప్రధానంగా దివ్య దర్శనం( Divya darshanam) టోకెన్లు ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్’ ప్రాతిపదికన భూదేవి కాంప్లెక్స్ లోనే జారీ చేయబడతాయి. టోకెన్ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. శనివారం దర్శనానికి కావలసిన టోకెన్లను జూన్ 6 సాయంత్రం నుంచి జారీ చేస్తారు. టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు వద్ద ఏర్పాటుచేసిన స్కానింగ్ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ స్కానింగ్ చేయించుకోవాలి. స్కానింగ్ తర్వాతే భక్తులు దర్శనానికి అనుమతించబడతారు. సర్వదర్శనం టోకెన్లకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగనుంది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లోనే వాటిని కూడా జారీ చేయనున్నట్లు టీటీడీ స్పష్టతనిచ్చింది.
Also Read : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
* రోజురోజుకు పెరుగుతున్న రద్దీ..
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు( summer holidays) ముగింపు దశకు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి పోటెత్తుతున్నారు. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుంది. జూన్ 2న శ్రీవారిని మొత్తం 80 వేలమంది దర్శించుకున్నారు. 34,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి కానుకల ఆదాయం మూడు కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చినట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12న విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇంకా వారం రోజుల వ్యవధి ఉండడంతో టీటీడీకి మరింత రద్దీ పెరగనుంది. అయితే భారీగా భక్తులు తరలి వస్తుండడంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల కోసం ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తోంది. మొన్న ఆ మధ్యన క్యూ లైన్ లో ఉన్న వ్యక్తి నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అయితే ఫ్యాక్ట్ చెక్ లో సదరు భక్తుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా తేలింది. మొత్తానికైతే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ మార్పులు చేస్తుండడం విశేషం.