Ration Cards in AP : రేషన్ వ్యవస్థలో( ration system) సమూల మార్పులు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వైసిపి ప్రవేశపెట్టిన ఎండియూ వాహనాల ద్వారా రేషన్ పక్కదారి పడుతోందని గుర్తించింది. అందుకే ఆ వాహనాలను రద్దు చేసింది. పాత పద్ధతిలో రేషన్ డిపోల వద్ద సరుకులు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం అయింది. రేషన్ కార్డు లబ్ధిదారులు డిపోల వద్దకు వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనపై కసరత్తు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ వేల కొత్త అంశం ప్రతిపాదిస్తోంది. ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే.. దానికి బదులుగా ఆ మేరకు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పుడు కీలక ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది. బియ్యం తీసుకొని వారి కార్డులు వెనక్కు ఇస్తే వారికి నగదు స్థానంలో.. సరుకులు ఇవ్వాలనే సూచన అందింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులపై కూడా కొత్త ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.
* డిపోల వద్ద సరుకుల పంపిణీ..
జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రక్రియ డిపోల వద్ద ప్రారంభమైంది. కోనసీమలో సీఎం చంద్రబాబు( CM Chandrababu) పర్యటన సందర్భంగా ఈ రేషన్ పంపిణీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా రేషన్ సరుకులు వద్దనుకుంటే.. దానికి బదులుగా ఆ మేరకు నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే.. దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్క కట్టి నగదు అందిస్తామని చెప్పారు. అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుంది అనే విషయం పై మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. అయితే ఇటీవల ప్రజా ఫిర్యాదుల కమిటీ సమావేశం జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. ఆరోగ్యశ్రీ అవసరాల కోసం రేషన్ కార్డు తీసుకుని.. ఎక్కువమంది బియ్యం అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదు పై కమిటీ చర్చించింది.
Also Read: చెవిరెడ్డి ఔట్.. ప్రకాశం బాధ్యతలు ఆయనకే!
* అన్నింటికీ ప్రామాణికం
అయితే ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు( ration card) ప్రామాణికంగా ఉంది. అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ కార్డుకు కూడా రేషన్ కార్డు ప్రామాణికం. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు ఎలాంటి సంబంధం ఉండకుండా చూస్తే బియ్యం అక్రమ రవాణా అరికట్టే అవకాశం ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. బియ్యం అవసరం లేని వారు రేషన్ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచించారు. అయితే రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా చేస్తే చాలామంది స్వచ్ఛందంగా కార్డులు అందజేస్తారని ఈ కమిటీలో అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
* ఆసక్తికర చర్చ
మరోవైపు ఈ కమిటీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు( aarogyasri card ), రేషన్ కార్డు, పెన్షన్ కార్డు.. ఇలా దేనికది ఉంటే బాగుంటుందని.. అన్నింటికీ రేషన్ కార్డును ప్రామాణికంగా చేయడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని ఈ సమావేశంలో ఎక్కువమంది ప్రస్తావించారు. మరోవైపు రేషన్ డిపోలో గతం మాదిరిగా 12 రకాల నిత్యవసర సరుకులు ఉంచితే.. బియ్యం పక్కదారి పట్టకుండా ఉండవచ్చని ఈ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డ్, రేషన్ పంపిణీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.