KA Paul : ఎన్నికల వేళ కేఏ పాల్ దశరత్నాలు.. ఆంధ్రా అమెరికా అయిపోయినట్టే..

కేఏ పాల్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు పోటీగా దశరత్నాలను ఏపీ ఓటర్లపై కురిపించారు.

Written By: NARESH, Updated On : May 2, 2024 10:04 pm

Key points in KA Paul's manifesto during AP elections

Follow us on

KA Paul : ” నా ప్రసంగానికి లక్షల మంది జనం వచ్చేవారు. నేను వెళ్తే అమెరికా ప్రెసిడెంట్ నా కోసం ఎదురు చూసేవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లోనే నేను కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాను. లక్షల మందికి ఉపాధి కల్పించాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. మరో అమెరికా లాగా మార్చుతాను. నేను నెలకొల్పిన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి. నన్ను అసెంబ్లీకి పంపించండి. మీ సమస్యలు మొత్తం పరిష్కరిస్తాను” ఇలా ఏపీలో వినూత్న పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఉన్నట్టుండి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి, మొన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో.. కేఏ పాల్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఏమేమున్నాయంటే..

కేఏ పాల్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు పోటీగా దశరత్నాలను ఏపీ ఓటర్లపై కురిపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగులకు ప్రతినెల 6 వేల రూపాయల భృతి, ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్య, వైద్యం, మహిళలకు విడతల వారీగా లక్ష రూపాయల ఆర్థిక సాయం వంటి హామీలను పాల్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అంతేకాదు మద్యాన్ని దశలవారీగా నియంత్రిస్తామని, ఏపీ రాష్ట్రానికి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాల్ తన ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించారు.

ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి గతంలో తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో పాల్ పోటీ చేశారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆయన పార్టీకి కుండ గుర్తును కేటాయించింది. ఈ కుండ గుర్తుతో పాల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పలుచోట్ల కుండలు తయారు చేస్తూ ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లోనే డిపాజిట్ తెచ్చుకోలేని పాల్.. ప్రస్తుత ఎన్నికల్లో ఏ స్థాయిలో ఓట్లు సాధిస్తారో వేచి చూడాల్సి ఉందని విశాఖపట్నం ఓటర్లు అంటున్నారు. మరోవైపు తాను దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి తగ్గిందని ఇటీవల పాల్ ప్రకటించడం విశేషం. ఇది తనకు ఎంతగానో ఉపకరిస్తుందని.. కచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తానని పాల్ చెబుతున్నారు. కాగా, ప్రధాన పార్టీలకు తీసుకొని విధంగా పాల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉండడం విశేషం.