Kesineni Srinivas: కేశినేని నాని టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారా? ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా?ఆయన కుటుంబ సభ్యులు సైతం చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? టిడిపి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడ సర్కిల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు రేగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేశారు కేశినేని నాని. తమ్ముడు చిన్ని చేతిలో ఓడిపోయారు. ఇలా ఓడిపోయిన రెండో రోజే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కేశినేని నాని స్వయంకృతాపరాధంతోనే టిడిపిని చేజేతులా వదులుకున్నట్లు అర్థమవుతోంది.2014,2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నాని. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అందుకు పార్టీతో పాటు తన ఇమేజ్ ఉందని కూడా భావించారు. అధినేత చంద్రబాబుతో మంచి సంబంధాలే నడిపారు.అదే సమయంలో నారా లోకేష్ తో కృష్ణా జిల్లాకు చెందిన నేతలు చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. పైగా 2019 ఎన్నికల్లో తన ఓటమికి కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చారన్నది నాని లో ఉన్న ఆవేదన. దీంతో లోకేష్ విషయంలో వేరే ఆలోచనతో ఉండేవారు కేశినేని నాని. పార్టీ మారడానికి అది కూడా ఒక కారణం.
* ఆ పరిణామాలతోనే
కేశినేని నాని సోదరుడు చిన్నిని లోకేష్ ప్రోత్సహిస్తున్నారన్నది ఆయనలో ఉన్న అనుమానం. అయితే చిన్నికి ప్రాధాన్యం ఇచ్చినా.. మీ ప్రయారిటీ తగ్గదని హై కమాండ్ చెప్పుకొచ్చింది. కానీ నానిలో ఒక రకమైన బేధాభిప్రాయం ప్రారంభమైంది.పైగా కృష్ణా జిల్లా టిడిపి నేతలతో ఆయనకు పడేది కాదు.మాజీ మంత్రి దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బోండా ఉమా వంటి నేతలతో విభేదాలు ఉండేవి. అదే సమయంలో తమ్ముడు చిన్ని వారితో చనువుగా ఉండేవాడు. వీరందరూ లోకేష్ టీం గా ముద్రపడ్డారు. అందుకే కేశినేని నాని లో ఒక రకమైన అభద్రతాభావం ప్రారంభం అయ్యింది. పార్టీ మారడానికి కారణం అయ్యింది.
* స్వయంకృతాపరాధమే
అయితే కేశినేని నాని విషయంలో టిడిపి హై కమాండ్ చాలా రకాల అవకాశాలు ఇచ్చింది. పార్టీ మారవద్దని.. తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చారు. అయినా సరే కేశినేని నాని వినలేదు. అంతకుముందు కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కేశినేని కుమార్తెకు మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. నాని అసంతృప్తిగా లేకుంటే ఆమెను గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి ఉండేవారు. ఆమె కూటమి ప్రభంజనంలో ఎమ్మెల్యే సైతం అయ్యేవారు. చేజేతులా ఆ అవకాశాన్ని కేశినేని నాని కోల్పోయారు. అందుకే ఇప్పుడు కేశి నేని నాని కంటే కుమార్తె శ్వేత టిడిపిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆవేశంతోనే అప్పట్లో కేశినేని నాని ఆ నిర్ణయం తీసుకున్నారని… ఆ కుటుంబం పట్ల టిడిపికి ఇప్పటికీ మంచి అభిప్రాయం ఉందని తెలుస్తోంది. కొద్ది రోజుల్లో కేశినేని నాని కుటుంబ సభ్యులు టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.