KCR Politics: పాడిందే పాట అన్నట్టు ఉంది కేసీఆర్( KCR) వైఖరి. చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును తలుచుకున్నారు. అసలు చంద్రబాబు ప్రస్తావన లేనిదే తాను రాజకీయం చేయలేను అన్నట్టు ఉన్నారు కేసీఆర్. అయితే ఇది నిజమే. ఏ చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వలేదని టిడిపి నుంచి బయటకు వచ్చారో.. అది మొదలు చంద్రబాబు పేరు తలవనిదే కేసిఆర్ కు పూట గడవని పరిస్థితి. అదే రాజకీయంగా పోటగాడవదు కూడా. ఎందుకంటే చంద్రబాబును బూచిగా చూపించి రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు కెసిఆర్. పదే పదే ఆ మాట చెబుతుండడంతో విసిగిపోయిన తెలంగాణ జనం నమ్మలేదు. చంద్రబాబు సైతం తెలంగాణ రాజకీయాల్లో తాను లేనని చెప్పడం ద్వారా కెసిఆర్ కు అవకాశం ఇవ్వకుండా చేశారు. అలా కెసిఆర్ ను అధికారం నుంచి దూరం చేయగలిగారు. అయితే తెలంగాణలో తాను లేనని చంద్రబాబు చెప్పిన ఇప్పుడు కెసిఆర్ వినడం లేదు. చంద్రబాబు పేరు చెప్పి మళ్లీ రాజకీయం మొదలుపెట్టారు.
తెలంగాణ ప్రజల్లో విషం నింపి..
26 సంవత్సరాల కిందట టిఆర్ఎస్( TRS ) ఉద్యమ పార్టీని ఏర్పాటు చేశారు కెసిఆర్. అది మొదలు చంద్రబాబుపై వ్యతిరేకతను తెలంగాణ ప్రజల్లో చూపారు. తాను ఏం చేయదలుచుకున్నది చెప్పడం రాజకీయ పార్టీ లక్షణం. కానీ కెసిఆర్ మాత్రం ఆ పని చేయలేదు. ఎప్పుడు చంద్రబాబు డేంజర్ అని చెప్పి తెలంగాణ ప్రజల్లో విష బోధ చేశారు. తెలంగాణ ప్రజలు పుష్కరకాలంగా ఆ ప్రచారాన్ని నమ్మారు. అందుకే 2014తో పాటు 2018లో కేసీఆర్ కు అధికారం ఇచ్చారు. కానీ 2023లో మాత్రం తిరస్కరించారు. కెసిఆర్ వ్యూహాన్ని గమనించిన చంద్రబాబు తెలంగాణలో తన నాయకత్వం నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీని తటస్థ స్థితిలో నిలబెట్టారు. దీంతో కెసిఆర్ కు ఆప్షన్ లేకుండా పోయింది. చంద్రబాబు లేకపోవడంతో కెసిఆర్ కు ఓటమి ఎదురైంది.
రాజకీయాలు అసాధ్యం..
చంద్రబాబు ( CM Chandrababu)పేరు లేకుండా.. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలంగాణలో రాజకీయం చేయలేనని కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. తెలంగాణ సెంటిమెంట్ నుంచి జాతీయవాదంతో బిఆర్ఎస్ గా విస్తరించి.. ఢిల్లీ రాజకీయాలను శాసించాలని చూశారు కేసీఆర్. ఇంట గెలవలేని ఆయన రచ్చ కూడా గెలవలేకపోయారు. రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఇప్పుడు మరోసారి తనకు ఆప్షన్ లేదు. చంద్రబాబు పై ఆరోపణలు చేయనిదే.. ఆయనపై విమర్శలు చేయనిదే.. తాను తెలంగాణలో బలపడనని భావించారు కేసీఆర్. అందుకే కొత్త పల్లవి అందుకున్నారు. కేంద్రం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.
ద్వంద అర్థాలతో..
ఏపీ సీఎం చంద్రబాబుకు శిష్యుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనగలిగారు. ఇది ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. తెలంగాణ పాలకుడు ఏపీ పాలకుడు కి శిష్యుడు అంటున్నారు. కేంద్రంలో చంద్రబాబుది కీరోల్ అంటున్నారు. ఇలా ఎలా చూసుకున్నా చంద్రబాబునే బ్లేమ్ చేస్తున్నారు కేసీఆర్. అంతకుమించి ఏమీ ఇందులో కనిపించడం లేదు కూడా. చంద్రబాబు స్మరణ లేనిది కేసిఆర్ కు రాజకీయం లేదు అనేది అర్థమైంది.