KCR- Jagan : రాజకీయాల్లో గౌరవ సాంప్రదాయాలు కొనసాగాలి. అప్పుడే మన తరువాత తరం వాటిని కొనసాగిస్తుంది. రాజకీయాల్లో ఔన్నత్యం సాధ్యపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన చేస్తూ.. ప్రతిపక్షాలతో పాటు మీడియాను గౌరవిస్తేనే ఆ సంప్రదాయం కొనసాగేది. ఒకవేళ అధికారపక్షం ప్రతిపక్షంలోకి వెళ్ళినా.. ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినా.. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏపీలో ఈ పరిస్థితి ఉందా? అంటే మాత్రం సామాన్యుడు సైతం లేదనే చెబుతాడు. గతంలో రాజకీయాలలో కనిపించే కట్టుబాట్లు, నైతిక విలువలు ఇప్పుడు ఉండట్లేదు. అందుకే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు ఏదో సమయంలో బాధితులుగా మారని తప్పని పరిస్థితి. గత ఐదేళ్లలో జగన్ పాలననే ఉదాహరణగా తీసుకుందాం.టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.కానీ నాడు శాసనసభ పక్ష నేతగా, సీఎంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. టిడిపి నుంచి ఓ ఐదారుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని తేల్చి చెప్పారు. నాడు చేసిన కామెంట్స్ నేడు జగన్ కు ఇబ్బందిగా మారాయి. 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఒకవేళ నాడు టిడిపిని, చంద్రబాబును గౌరవించి ఉంటే.. జగన్ కు అదే తరహాలో గౌరవం దక్కేది. కానీ జగన్ అలా ఆలోచించలేదు. చంద్రబాబును వెంటాడి వేటాడారు. శాసనసభ వేదికగా దారుణంగా అవమానించారు. అవమాన భారంతో శాసనసభ నుంచి బయటకు పోయేలా చేశారు. అందుకే నేడు జగన్ శాసనసభకు వచ్చేందుకు భయపడుతున్నారు.
* కెసిఆర్ ది అంతా ఏకపక్షమే
తెలంగాణలో సైతం కేసీఆర్ అదే మాదిరిగా వ్యవహరించారు. ప్రతిపక్ష నేతలను గౌరవించలేదు. మీడియాను లెక్క చేయలేదు. చివరకు వామపక్ష నేతలకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పోనీ తనకు తాను స్వయంపాలన అందించారా అంటే అది లేదు. అప్పటివరకు ఉద్యమ తెలంగాణ అన్నారు. తరువాత బంగారు తెలంగాణను తెరపైకి తెచ్చారు. పక్క పార్టీలకు చెందిన నేతలను చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు. విపక్ష నేతలను చాలా చులకనగా మాట్లాడారు. ఇప్పుడు అవే మాటలు తనకు ఎదురవుతాయని తెలిసి శాసనసభకు డుమ్మా కొడుతున్నారు.
* అదే ఆలోచనలో జగన్
కెసిఆర్ మాదిరిగానే జగన్ ఆలోచనలు నడిచాయి. 2014 నుంచి 2023 వరకు తెలంగాణకు పాలన అందించారు కేసీఆర్. తనకు తాను తెలంగాణ మహాత్ముడుగా భావించారు. 2018లో రెండోసారి విజయం దక్కేసరికి.. ఎక్కడలేని అహాన్ని తలకెక్కించుకున్నారు. ప్రజల్లో క్రమేపి సెంటిమెంట్ పడిపోయిందని గ్రహించలేకపోయారు. సెంటిమెంట్ తోనే తాను రాజకీయాలు చేశానన్న విషయాన్ని గుర్తు చేసుకోలేకపోయారు. కేవలం తన పద్ధతి ద్వారా, విపక్ష నేతలను చులకన చేయడం ద్వారానే అధికారానికి దూరమయ్యారు. తెలంగాణ సమాజం దూరమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు.
* ప్రతిపక్షం అన్న బాధ
జగన్ పరిస్థితి అదే. విపక్ష నేతలను చాలా చులకనగా చూశారు. వారు నా వెంట్రుక కూడా పీకలేరని ఎద్దేవా చేశారు. 30 సంవత్సరాల పాటు ఏపీని ఏలుతానని ప్రగల్బాలు పలికారు. వాస్తవ పరిస్థితిని మరిచిపోయారు. తన వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పసిగట్ట లేకపోయారు. సాధారణంగా ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం. కానీ ఆ ప్రజల వాయిస్ ను వినిపించలేని స్థితిలోకి ఈ ఇద్దరు నేతలు చేరుకున్నారు. దానినే తమకు గౌరవం ఇవ్వడం లేదనే సంకేతాన్ని పంపుతున్నారు. అయితే ఈ విషయంలో ఆ ఇద్దరు నేతలు ఎవరిని శంకించాల్సిన అవసరం లేదు. అది ముమ్మాటికి వారి స్వయంకృత అపరాధమే.