Homeఆంధ్రప్రదేశ్‌KCR-Jagan: కేసీఆర్-జగన్.. ఇద్దరు మిత్రుల ఒంటరి ప్రయాణం.. తీరమెక్కడో.. గమ్యమేమిటో తెలియదు పాపం..!

KCR-Jagan: కేసీఆర్-జగన్.. ఇద్దరు మిత్రుల ఒంటరి ప్రయాణం.. తీరమెక్కడో.. గమ్యమేమిటో తెలియదు పాపం..!

KCR-Jagan: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటరైన ఆ ఇద్దరు ఒంటరి గువ్వలు ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒకరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. మరొకరు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. ఇద్దరూ మంచి మిత్రులు. రాజకీయంగా, వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కానీ, వేర్వేరు కారణాలతో ఇద్దరూ ఆరు నెలల వ్యవధిలో ఒంటరయ్యారు. రాజకీయాల్లో ఏకాకులుగా మిగిలిపోయారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న ఆశ కేసీఆర్‌ను ఒంటరిని చేసింది. నరేంద్రమోదీ గుజరాత్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రధాని అయ్యాడు. ఆయననే స్ఫూర్తిగా తీసుకున్న కేసీఆర్‌.. తాను తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబటి.. ప్రధాని పదవికి అదే అర్హతగా భావించారు. తెలంగాణ మోడల్‌ పేరుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. అన్నీ కలిసి వస్తే ప్రధాని కూడా అయిపోవాలని ఆశపడ్డారు. ఇందుకోసం ఎన్డీఏ, యూపీఏ(ప్రస్తుతం ఇండియా) కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కూటమి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ, కేసీఆర్‌ను దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలెవరూ నమ్మలేదు. దీంతో చివరకు ఆయనే తన పార్టీని జాతీయ పార్టీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రసమితిగా మార్చి తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. కేంద్రంలో రైతు ప్రభుత్వం తెస్తారని ప్రకటించారు. బీజేపీని గిచ్చి కయ్యం పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీకి సమ దూరం అంటూ ఇద్దరితో యుద్ధం చేస్తున్నానని వాటి వెనుక ఉన్న మిత్రపక్షాలను కూడా దూరం చేసుకున్నారు. బీజేపీని అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేశారు. మోదీని గద్దె దించడమే లక్ష్యం అని ప్రకటించారు. మోదీకి పాలన చేతకావడం లేదని పెద్దపెద్ద విమర్శలు చేశారు.

తానే ఒంటరై..
కానీ, ఇప్పుడు కేసీఆర్, ఆయన పార్టీ ఒంటరయ్యాయి. 2023 నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే గెలిచి అధికారం కోల్పోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు, పదేళ్లు అధికారం అనుభవించిన వాళ్లు ఇప్పుడు అధికార కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. హస్తం కండువాలు కప్పుకుంటున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న కేశవరావు వంటి నేతలు కూడా పార్టీ మారిపోయారు. ఇక మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్‌ ఒక్కరిని కూడా బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిపించుకోలేదు. వరుస ఓటములతో ఇప్పుడు ఫాం హౌస్‌కు పరిమితమయ్యారు. తన కొడుకు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావును బయట తిప్పుతున్నారు. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు బలమైన నాయకత్వం లేని పార్టీగా కనిపిస్తోంది.

జగన్‌ కూడా ఒంటరే…
ఇక 2024, మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి కూడా చిత్తుగా ఓడిపోయారు. ప్రజలకు నేరుగా డబ్బులు పంచుతున్నానని.. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నవారంత తనవెంటే ఉన్నారని భావించిన జగన్‌ వైనాట్‌ 175 నినాదంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. 151 సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ఇప్పుడు మధ్యలో 5 అంకెను కోల్పోయి కేవల 11 సీట్లకు పరిమితమయ్యారు. తనకు మరో 20 నుంచి 30 ఏళ్లు రాజకీయం చేయగల వయసు, ఓపిక ఉన్నాయని చెప్పుకున్న జగన్‌ను ఆంధ్రా ప్రజలు గద్దె దించారు. సంక్షేమం ఒక్కటే కాదు.. అభివృద్ధి కూడా కావాలని ఓటుతో తీర్పు చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దీంతో ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జగన్‌.. ఎన్నికల తర్వాత మరింత ఒంటరయ్యారు. మరోవైపు ఆయనపై ఉన్న అవినీతి కేసులు కూడా తిరిగి వేగవతమయ్యే అవకాశం ఉంది. 2019 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వంలో చేరకపోయినా.. సఖ్యతగా మెలిగారు. కానీ, 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. దీంతో బీజేపీకి జగన్‌ దూరమయ్యారు.

ఒంటరి ప్రయాణం..
జగన్, కేసీఆర్‌ ఇద్దరూ ప్రాణ స్నేహితులే. ఇద్దరూ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. జగన్‌ పార్టీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. కానీ, అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. కేసీఆర్, జగన్‌ ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. కానీ, ఇద్దరికీ తగిన బలం కూడా లేదు. మరోవైపు కేసీఆర్‌ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఈతరుణంలో జన్‌కు కేసీఆర్‌ ఎలాంటి సాయం చేయకపోవచ్చు. తన కూతురు ఇప్పటికే ఢిల్లీ లిక్కర స్కాం కేసులో జైల్లో ఉంది. ఈ పరిస్థితిలో జగన్‌కు మద్దతు ఇస్తే.. బీజేపీకి దగ్గరయ్యే ఆర్గం మూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కూడా మోదీకి కోపం తెప్పించే పని చేయకపోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version