IND vs SL: జియో సినిమాలో టెలికాస్ట్ కాదు.. హాట్ స్టార్ హక్కులు దక్కించుకోలేదు.. ఉచితంగా ఎలా చూడాలంటే..

శ్రీలంక పర్యటనకు సంబంధించి భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ ఆటగాడు హార్దిక్ పాండ్యాను టి20 సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను నియమించింది. వైస్ కెప్టెన్ గా గిల్ కు అవకాశం కల్పించింది. జట్టు కూర్పులో గౌతమ్ గంభీర్ మాట చెల్లుబాటయింది. ఫలితంగా కొంతమంది ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా పోయింది

Written By: Anabothula Bhaskar, Updated On : July 22, 2024 12:41 pm
Follow us on

IND vs SL : టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. జింబాబ్వేతో టి20 సిరీస్ దక్కించుకున్న తర్వాత.. టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 27 నుంచి 3 t20 లు, 3 వన్డేలను ఆడనుంది. టీమిండియా కు టి20 టోర్నీలో సూర్య కుమార్ యాదవ్, వన్డే టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నారు. ఈ రెండు ఫార్మాట్లకు గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్థానం శ్రీలంక టోర్నీ ద్వారా ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ 20 ఫార్మాట్ కు వీడ్కోలు పలకడంతో సూర్యకుమార్ యాదవ్ కు పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్సీ ఆకాశం లభించింది. ఇదే సమయంలో మరో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు జట్టులో ఆడే అవకాశం దక్కింది..

శ్రీలంక పర్యటనకు సంబంధించి..

శ్రీలంక పర్యటనకు సంబంధించి భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ ఆటగాడు హార్దిక్ పాండ్యాను టి20 సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను నియమించింది. వైస్ కెప్టెన్ గా గిల్ కు అవకాశం కల్పించింది. జట్టు కూర్పులో గౌతమ్ గంభీర్ మాట చెల్లుబాటయింది. ఫలితంగా కొంతమంది ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా పోయింది. టి20 ప్రపంచ కప్ తర్వాత రెస్ట్ తీసుకున్న ఆటగాళ్లు మొత్తం శ్రీలంక టోర్నీ ద్వారా జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. జింబాబ్వే టూర్ లో అదరగొట్టిన ఆటగాళ్లకు శ్రీలంక టోర్నీలో అవకాశంలో లభించలేదు. మహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వంటి వారు జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిషేక్ శర్మ, రుతు రాజ్ గైక్వాడ్, జురెల్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే, ఆవేశ్ ఖాన్ వంటి వారు వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది..

షెడ్యూల్ ఇదీ

తొలి టి20 మ్యాచ్ జూలై 27, శనివారం పల్లెకెలే వేదికగా జరుగుతుంది. రెండవ టి20 మ్యాచ్ జూలై 28న పల్లెకెలే వేదికగా ఆదివారం జరుగుతుంది. మూడవ టి20 మ్యాచ్ జూలై 30 పల్లెకెలే వేదికగా మంగళవారం జరుగుతుంది. ఇక తొలి వన్డే ఆగస్టు 2 కొలంబో వేదికగా శుక్రవారం జరుగుతుంది. రెండవ వన్డే ఆగస్టు 4 కొలంబో వేదికగా ఆదివారం జరుగుతుంది. మూడవ వన్డే ఆగస్టు 7 కొలంబో వేదికగా బుధవారం జరుగుతుంది.

ఉచితంగా చూసే అవకాశం లేదు.. కానీ..

శ్రీలంక – భారత్ మధ్య జరిగే టోర్నీ ప్రసార హక్కులను అటు జియో , ఇటు స్టార్ స్పోర్ట్స్ దక్కించుకోలేదు. అందువల్ల యూజర్లకు ఉచితంగా చూసే అవకాశం లభించదు. వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ గ్రూప్ దక్కించుకుంది. యూజర్లకు అప్పుడు ఉచితంగా చూసే అవకాశం కలిగింది. ఇక ఐపీఎల్ ప్రసార హక్కులను జియో దక్కించుకోగా.. యూజర్లను ఆకట్టుకునేందుకు అది కూడా ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రస్తుత టీమిండియా – శ్రీలంక మధ్య జరిగే టోర్నీ ప్రసార హక్కులను సోనీ నెట్వర్క్ గ్రూపులోని సోని స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/ తెలుగు), సోనీ స్పోర్ట్స్ టీవీ టెన్ 5 చానల్స్ లో శ్రీలంక – ఇండియా ఆడే మ్యాచ్ లు ప్రసారమవుతాయి. సోనీ నెట్వర్క్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ యాప్ లో ఈ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. జియో సినిమా, హాట్ స్టార్ పలు ప్రతిష్టాత్మక టోర్నీలను ఉచితంగా చూసే అవకాశాన్ని యూజర్లకు కల్పించాయి. అయితే సోనీ లివ్ యాప్ లో ఉచితంగా చూడాలంటే కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. చివరికి టీవీ చానల్స్ కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. ఒకవేళ ఉచితంగా చూడాలి అనుకుంటే మాత్రం జియో టీవీ యాప్ లో ఆ అవకాశం ఉంది.. ఈ యాప్ లో సోనీ టీవీ నెట్వర్క్ లోని చానల్స్ ఎంపిక చేసుకొని భారత్- శ్రీలంక మధ్య సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎటువంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు.