Kadapa New Controversy: కడప మున్సిపల్ కార్పొరేషన్( Kadapa Municipal Corporation) మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. కానీ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి తిరిగి పదవి తెచ్చుకున్నారు. మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు మేయర్ తో పాటు 48 మంది కార్పొరేటర్లు తమ పదవులను పోగొట్టుకునే ప్రమాదం ఏర్పడింది. ఇందుకు మేయర్ ఒంటెద్దు పోకడలే కారణమని తెలుస్తోంది. సాధారణంగా మున్సిపల్ నిబంధనలను అనుసరించి ఆరు నెలలకు విధిగా సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. అయితే గత ఆరు నెలలుగా సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. రేపటితో ఆ గడువు కూడా ముగుస్తుంది. దీంతో మేయర్ తో పాటు 48 మంది కార్పొరేటర్ల పదవికి గండం ఏర్పడింది.
ఎమ్మెల్యే దూకుడుతో
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి దూకుడు పెంచారు. కడప కార్పొరేషన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా మేయర్ సురేష్ బాబు తీరును ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ఆమెకు సమావేశంలో కనీసం కుర్చీ కూడా వేయలేదు. అప్పుడే ఆమె శపథం చేశారు. తనకు కుర్చీ లేకుండా చేసిన మేయర్ సురేష్ బాబును గద్దె దించుతానని సవాల్ చేశారు. అదే సమయంలో చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు టిడిపిలోకి వచ్చారు. ఇంకోవైపు మేయర్ సురేష్ బాబు తన సొంత కుటుంబ సభ్యులకు కడప కార్పొరేషన్ లో నామినేటెడ్ పనులు కట్టబెట్టారు. ఇదంతా విజిలెన్స్ విచారణలో తేలడంతో మేయర్ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు మేయర్ సురేష్ బాబు. ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులపై స్టే విధించడంతో మేయర్ గా సురేష్ బాబు కొనసాగుతూ వచ్చారు.
వెనక్కి తగ్గని మేయర్
అయితే తన విషయంలో కూటమి ఆగ్రహంగా ఉందని తెలిసినా మేయర్ సురేష్ బాబు( Mayor Suresh Babu) వెనక్కి తగ్గడం లేదు. వాస్తవానికి నిన్ననే కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ సమావేశ మందిరంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లకు, అధికారులకు సీట్లు ఏర్పాటు చేశారు. కానీ మేయర్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అక్కడకి రాలేదు. తన ఛాంబర్ లోనే మేయర్ సురేష్ బాబు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అజెండాను కార్పొరేటర్ చదవగా మిగిలిన వారు ఆ అంశాలను ఆమోదించారు. కడప కమిషనర్ మనోజ్ రెడ్డి, అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, ఎస్ఈ చెన్నకేశవరెడ్డి తమకు సహకరించని కారణంగా వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తీర్మానం చేశారు. కానీ ఈ సమావేశంలో ఏ ఒక్క అధికారి పాల్గొనక పోవడం విశేషం.
Also Read: Balakrishna Birthday: గమ్ ఏదిరా బాబూ.. బాలయ్య మీసం ఊడింది.. వైరల్ వీడియో
మధ్యాహ్నం వరకు వేచి ఉన్న టిడిపి కార్పొరేటర్లు..
అయితే అదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి( MLA Madhavi Reddy ), టిడిపికి చెందిన తొమ్మిది మంది కార్పొరేటర్లు, కమిషనర్ తో పాటు ఉన్నతాధికారులు వేచి ఉన్నారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తూ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. సమావేశం నిర్వహణకు మరో తేదీని నిర్ణయించుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు గడువు లేదు. ఈరోజు సమావేశం ఏర్పాటు అయ్యే అవకాశం లేదు. గడువులోపు సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కానందున మేయర్ సురేష్ తో పాటు 48 మంది కార్పొరేటర్ల పదవులు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.